బీఆర్‌ఎస్ లేవదు..బీజేపీ చాలదు
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:12 AM
తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు.
మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో హర్షం
బీఆర్‌ఎస్‌పై జనంలో ఇప్పటికీ విముఖత
బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు.. ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు
ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి.. పార్టీని మరింత బలోపేతం చేయండి.. ఖర్గే సూచన
నేడు రాహుల్, కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. బుధవారం సాయంత్రం రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్, రఘువీర్‌రెడ్డితో కలిసి రేవంత్ ఆయనను కలిశారు. ఐదు నిమిషాలు అందరూ ఖర్గేతో మాట్లాడిన తర్వాత సుమారు 25 నిమిషాలపాటు ఖర్గే, రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ సాధించబోయే మునిసిపాలిటీల గురించి రేవంత్ వివరించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, మునిసిపాలిటీల్లోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో విముఖత పెరిగిందన్నారు. దీంతో బీఆర్‌ఎస్ అవినీతిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, అక్రమాలన్నింటినీ పూర్తిస్థాయిలో వెలికితీయాలని సీఎం రేవంత్‌రెడ్డికి.. ఖర్గే సూచించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్‌కు నోటీసులు తదితర అంశాలను రేవంత్ వివరించగా.. దీనిపై ప్రజల్లో ఎటువంటి చర్చ జరిగిందని ఖర్గే ఆరా తీసినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, నామినేటెడ్ పదవులపై కూడా ఖర్గేతో రేవంత్ చర్చించినట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలో పాలనపై ఖర్గే సంతృప్తి వ్యక్తం చేసినట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఆలోచనపై రేవంత్‌ను అభినందించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. చివరగా తెలంగాణలో బీజేపీ పరిస్థితిపైనా ఖర్గే ఆరా తీశారని, అయితే.. తెలంగాణలోని పరిస్థితులు బీజేపీకి ఎప్పటికీ అనుకూలం కాదని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. అంతకుముందు, మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 3.10 గంటలకు ఢిల్లీకి చేరుకున్న సీఎం విమానాశ్రయం నుంచి తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసానికి వెళ్లారు. కాగా, గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.