నేడు కుమరంభీం జిల్లాకు సీఎం
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:43 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కొత్తగూడలో 25 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లూ మంజూరు
హైదరాబాద్/ఆసిఫాబాద్/శంషాబాద్ రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో సుమారు రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కెరిమరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి రాష్ట్రంలో రెండో విడత కింద 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. చింతలమానేపల్లి మండలంలోని కౌటాలలో రూ.56.55 కోట్లతో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించే 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులకూ సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు రెబ్బెన మండలం నాంబాల్‌లో రూ.6 కోట్లతో ఏర్పాటు చేయబోయే సౌర విద్యుత్తు ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న 8 అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. సభ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి చేరుకొని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు. సభకు లక్ష మందిని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖర్గేను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం
కర్ణాటకలోని గుల్బర్గాకు వెళుతూ మధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్ హోటల్‌లో బస చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సంపత్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ కూడా ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ చేపట్టనున్న నేపథ్యంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలను ఖర్గేకు మహేశ్‌గౌడ్ వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని బూత్ స్థాయి ఏజెంట్లకు బుద్ధవనంలో త్వరలో శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరగా ఖర్గే సానుకూలంగా స్పందించారు. ధాన్యం సేకరణలో కేంద్రం సహకరించడం లేదని, దశలవారీగా నిరసన వ్యక్తం చేస్తామని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. రేవంత్ సర్కారు పాలనపై ఖర్గే సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో దేశంలోనే నంబర్1
రాష్ట్రంలో నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు’ భవిష్యత్తులో దేశ విద్యా వ్యవస్థలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెడతాయని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో జరిగిన విద్యా విధ్వంసాన్ని సరిదిద్ది, విద్యా వికాస పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం నడుం బిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని ‘పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’ (పీజీఐ)లో కేంద్ర విద్యాశాఖ పేర్కొనడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘అభివృద్ధికి తొలి కొలబద్ద విద్యే. పేదరికాన్ని నిర్మూలించి, సమాజాన్ని జాగృతం చేయగల శక్తి ఒక్క విద్యకే ఉంది. అందుకే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖ బాధ్యతలను నేనే స్వయంగా తీసుకున్నా’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.