Share News

మహిళా సూపర్‌బజార్లు

ABN , Publish Date - May 26 , 2026 | 05:16 AM

డీమార్ట్‌, బిగ్‌ బజార్‌ లాంటి హైపర్‌ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్‌ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా......

మహిళా సూపర్‌బజార్లు

  • డీమార్ట్‌కు పోటీగా పట్టణాల్లో ఏర్పాటు

  • కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం

  • కోటి మంది చెల్లెళ్లకు చీర పెట్టబోతున్నాం

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

  • 8 వేల స్త్రీశక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): డీమార్ట్‌, బిగ్‌ బజార్‌ లాంటి హైపర్‌ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్‌ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా స్వశక్తి సంఘాలకు పిలుపునిచ్చారు. అందుకు కావాల్సిన అన్ని రకాలా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. పట్టణాల్లో సూపర్‌బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్థంగా ఉందని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందాలి, రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ దొరకాలి, మహిళా సంఘాలకు ఆదాయం రావాలి అనే లక్ష్యంతో సూపర్‌ బజార్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి సూపర్‌ బజార్లలో ప్రభుత్వం వాటాదారుగా ఉంటుందని, రైతుల పంటలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు ఇందులో అమ్ముతారని తెలిపారు. సోమవారం సచివాలయం వేదికగా 8 వేల ఇందిరాగాంధీ స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకేసారి 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని చెప్పారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, వారి రుణం తీర్చుకొనే కార్యక్రమంలో భాగంగా పదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించారు. సొంత చెల్లిని కూడా భారంగా భావించి, ఆస్తిలో వాటా అడుగుతారనే భయంతో ఇంట్లోంచి వెళ్లగొడుతున్న అన్నల్ని, శాపనార్థాలు పెడుతున్న చెల్లెళ్లను చూస్తున్నామని కేటీఆర్‌-కవితలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


తాము మాత్రం రాష్ట్రంలోని కోటిమంది ఆడబిడ్డలను సొంత చెల్లెళ్లలాగా భావించి చీర పెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మహిళలను బస్సుల యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు.. జూన్‌ 5న పరేడ్‌ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుందని, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుందని, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, వడ్డీ కింద ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారాల్లోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. రైస్‌ మిల్లులు, మండల స్థాయి గోదాములు, లాజిస్టిక్‌ పార్కులు నిర్మించుకోవాలని కోరారు. అవసరమైన చోట 100 ఎకరాల వరకు భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్థంగా ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్‌లో మహిళా సంఘాల పాత్ర పెరగాలన్నారు. వాళ్లే వడ్లు కొని బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1000మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను మహిళాసంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్‌ తరహాలో పెట్రోల్‌ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మహిళా సంఘాలతో సీఎం మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోలు బంకు ద్వారా ఇప్పటివరకు రూ.27 లక్షలు సంపాదించామని చెప్పారు. దీంతో సీఎం వారిని అభినందించారు.

నిర్మల్‌ సమాఖ్యకు అభినందన

బ్యాంకులకు వందకు వంద శాతం రుణాలు తిరిగి చెల్లించిన నిర్మల్‌ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను ముఖ్యమంత్రి అభినందించారు. మెయిన్‌ రోడ్డులో వారికి పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పెద్ద వ్యాపారులు, పెద్ద సంస్థలు బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టి పారిపోతున్న తరుణంలో మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ గుణపాఠం నేర్పుతోందని కొనియాడారు. మహిళలకు గతంలో ఇచ్చిన చీరలు నాణ్యతలేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారనే విమర్శలు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు. చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్‌ చీరలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.

Updated Date - May 26 , 2026 | 05:16 AM