నిజామియా యునానీ కాలేజీకి కేంద్రం షాక్!
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:19 AM
ఘన చరిత్ర కలిగిన చార్మినార్ ప్రభుత్వ నిజామియా టిబ్బి యునానీ వైద్య కళాశాలలో కనీస వసతులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది కొరతపై కేంద్రం కొరడా ఝళిపించింది.
యూజీ, పీజీ ప్రవేశాలకు అనుమతి నిరాకరణ
వెబ్ ఆప్షన్లను నిలిపివేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఘన చరిత్ర కలిగిన చార్మినార్ ప్రభుత్వ నిజామియా టిబ్బి యునానీ వైద్య కళాశాలలో కనీస వసతులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది కొరతపై కేంద్రం కొరడా ఝళిపించింది. 2026-27 విద్యా సంవత్సరానికి బీయూఎంఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతిని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్ఎం)కు చెందిన మెడికల్ అసెస్ మెంట్ అండ్ రేటింగ్ బోర్డు నిరాకరించింది. దీంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) ఆయుష్ కౌన్సెలింగ్‌లో నిజామియా బీయూఎంఎస్ సీట్లకు వెబ్ ఆప్షన్లను నిలిపివేసింది. కేంద్రం నుంచి మళ్లీ అనుమతి లభిస్తేనే ఆ సీట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని వర్సిటీ స్పష్టం చేసింది. నిజామియా కాలేజీలో ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి బీయూఎంఎస్ లో 94 (రెగ్యులర్ 75) సీట్లు, ఐదు పీజీ విభాగాల్లో 45 (రెగ్యులర్ 36) సీట్లు ఉన్నాయి. అనుమతుల కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఎన్‌సీఐఎస్ఎం బృందం జూన్ 18, 19 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా లోపాలను గుర్తించింది. ఆగస్టు 24న షోకాజ్ నోటీసు జారీ చేసి, 27న విచారణ జరిపింది. కాలేజీ ఇచ్చిన వివరణలు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ సెప్టెంబరు 8న అనుమతుల నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసింది. యూజీకి అనుమతి రద్దయితే దానికి అనుబంధంగా ఉన్న పీజీ కోర్సుల అనుమతులు కూడా రద్దయినట్లేనని బోర్డు స్పష్టం చేసింది.
సర్జరీ విభాగంలో ఒక్క అధ్యాపకుడూ లేరు
కాలేజీలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ‘జరాహత్’(సర్జరీ) విభాగంలో ఒక్క ప్రొఫెసర్ లేదా అధ్యాపకుడు కూడా లేకపోవడం కేంద్ర బోర్డును విస్మయానికి గురిచేసింది. ఇతర విభాగాల్లోనూ అధ్యాపకుల కొరత ఉంది. తొమ్మిది ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయోమెట్రిక్ హాజరును పరిశీలించగా ఏడుగురు ప్రొఫెసర్లకు కనీస హాజరు లేదని తనిఖీ బృందం గుర్తించింది.