Share News

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:01 AM

గ్రామీణ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకరించడం లేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురు చూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల కాలేదని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
PongulatiSrinivas Reddy

  • కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఇన్నిరోజులు ఎదురు చూశాం

  • ఆ కారణంగానే ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు ఆలస్యం

  • పేద ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టొద్దని రూ.185 కోట్లు విడుదల

  • మార్చి 31వరకు పూర్తైన 15,475

  • ఇళ్లకు చివరి బిల్లులు నేడు జమ

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకరించడం లేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురు చూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల కాలేదని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా.. ఈ ఏడాది మార్చి 31వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తైన 15,475 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.185 కోట్లు విడుదల చేసిందని, ఈ నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా నిధులు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఫలితంగా ఇళ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ డిమాండ్‌ ఉందని పొంగులేటి అన్నారు. ‘‘దానిని దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను పలుమార్లు కలిశారు. తెలంగాణకు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. రెండు వారాల క్రితం నేను కూడా ఎంపీలతో కలిసి వెళ్లి ఇళ్లు మంజూరు కోసం కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశాను’’ అని తెలిపారు. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు..


కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా ఆపేశామని, ఇక పేద ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. కాగా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సెప్టెంబరు 15లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తామని పొంగులేటి వెల్లడించినట్లు ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Aug 27 , 2026 | 07:02 AM