పూర్తి స్థాయిలో స్థిరచార్జీలు పెంచాలి
ABN , Publish Date - May 15 , 2026 | 04:24 AM
విద్యుత్‌ను వినియోగించినా, వినియోగించకపోయినా వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్ చార్జీలు (స్థిర చార్జీలు) వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ...
విద్యుత్ వాడినా, వాడకున్నా కనీస చార్జీలు వసూలు చేయాలి
ఇంధన చార్జీలు మాత్రం తగ్గించాలి
వాణిజ్య వినియోగదారులకు 100శాతం, గృహాలకు 50శాతం స్థిరచార్జీలు ఉండాలి
కేంద్ర విద్యుత్ సంస్థ సిఫార్సులు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ను వినియోగించినా, వినియోగించకపోయినా వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్ చార్జీలు (స్థిర చార్జీలు) వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సిఫార్సు చేసింది. స్థిర/డిమాండ్ చార్జీలను గణనీయంగా పెంచాలని, అదే సమయంలో యూనిట్‌కు ఇంత చొప్పున వసూలు చేసే ఇంధన చార్జీలను తగ్గించాలని సూచించింది. దేశమంతా ఒకేలా విద్యుత్ టారిఫ్ విధానం అమలుపై ఆలిండియా డిస్కమ్స్ అసోసియేషన్ (ఏఐడీఏ) విజ్ఞప్తి మేరకు అధ్యయనం చేసిన సీఈఏ ఈ సిఫార్సు చేసింది. దీన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)లకు పంపి టారిఫ్ హేతుబద్ధీకరణ చేపట్టాలని సూచించింది. సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు కోసం సుదీర్ఘ ఒప్పందాలు (పీపీఏ) చేసుకుంటాయి. ఆ మేరకు విద్యుత్ కొన్నా, కొనకపోయినా స్థిరచార్జీల రూపంలో కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దానికితోడు ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను డిస్కమ్‌ల వరకు చేర్చే ట్రాన్స్‌కోకు కూడా స్థిరచార్జీలు కట్టకతప్పదు. అయితే ఎక్కువ విద్యుత్ వాడే పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు.. ఓపెన్ యాక్సెస్ విధానంలో మార్కెట్లో తక్కువ ధరకు లభించే విద్యుత్ కొంటున్నాయి. ఆ పరిశ్రమలు, సంస్థలకు విద్యుత్ సరఫరా కోసం వ్యవస్థలు ఏర్పాటు చేసిన డిస్కమ్‌లకు మాత్రం నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పారిశ్రామిక, వాణజ్య వినియోగదారుల నుంచి స్థిరచార్జీలు వసూలు చేసుకోవాలని సీఈఏ సిఫార్సు చేసింది. గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల్లో స్థిరచార్జీలను 2030 నాటికి 25శాతానికి, 2035 నాటికి 50శాతానికి.. పారిశ్రామిక, వాణజ్య వినియోగదారులకు 100 శాతం పెంచాలని సూచించింది. విద్యుత్ సగటు వినియోగాన్ని బట్టి ఈ స్థిరచార్జీలు ఉంటాయి. ప్రస్తుతం 200 యూనిట్లలోపు వాడే గృహ వినియోగదారులకు ఒక కిలోవాట్‌కు రూ.10గా ఉన్న స్థిర/డిమాండ్ చార్జి రూ.20కి, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ప్రతి కేవీఏకు రూ.500 నుంచి రూ.2000కు పెరిగే అవకాశం ఉంది.