Share News

ఓటుకు నోటు కేసులో నా వాదనలూ వినండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:21 AM

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ అంశంలో బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న తన వాదనలను కూడా వినాలని కోరుతూ నామినేటెడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌. స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఓటుకు నోటు కేసులో నా వాదనలూ వినండి
SUPREMECOURT

సుప్రీంకోర్టులో స్టీఫెన్‌సన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌

తదుపరి విచారణ 10 రోజుల తర్వాతకు వాయిదా

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ అంశంలో బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న తన వాదనలను కూడా వినాలని కోరుతూ నామినేటెడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌. స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, కాబట్టి ఆ కేసు చెల్లదని 2021, జూలై 22న రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. ఈ కేసులో తన పేరునూ తొలగించాలని కోరుతూ 2021, ఏప్రిల్‌ 13న సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి ఈ పిటిషన్లు సీజేఐ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. కోర్టులో విచారణ ప్రారంభమైన వెంటనే.. స్టీఫెన్‌సన్‌ తరఫున న్యాయవాది ఓ ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. అందుకు అనుమతిస్తూ కేసు తదుపరి విచారణను 10 రోజుల తర్వాతకు వాయిదా వేసింది.

Updated Date - Oct 06 , 2026 | 06:35 AM