22ఏ పై రేవంత్‌రెడ్డి, పొంగులేటి కుమ్మక్కు
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:30 AM
అన్యాయంగా ప్రైవేటు భూములను, పేదల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని, కేవలం కమీషన్ల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి కుమ్మక్కయ్యారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. నిషేదిత జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించాలంటే ఆ భూమి విలువలో 30 శాతం కమీషన్ అడుగుతున్నారని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు
తప్పు చేయకపోతే రాత్రికి రాత్రే జాబితాను తొలగించారేం?
ఆరోగ్యశ్రీ బకాయిలు, సిబ్బందికి జీతాలు చెల్లించాలి: హరీశ్
ఉప్పల్/హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అన్యాయంగా ప్రైవేటు భూములను, పేదల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని, కేవలం కమీషన్ల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి కుమ్మక్కయ్యారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. నిషేదిత జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించాలంటే ఆ భూమి విలువలో 30 శాతం కమీషన్ అడుగుతున్నారని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ బోడుప్పల్ తిరుమలా మిడోస్ కాలనీలో జరిగిన 22ఏ బాదితుల సభలో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు తప్పు చేశారంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటిలు సంబందిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. తాజాగా రాత్రికి రాత్రే భూభారతి పోర్టల్ నుంచి మొత్తం నిషేదిత జాబితాను తొలగించారని, తప్పు చేయకపోతే ఆ జాబితాను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇదో పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. ఆదివారం కొందరు ఆరోగ్యశ్రీ సిబ్బంది హరీశ్ రావును కలిశారు. తమకు వేతనాలు రావడంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్ రావు ఎక్స్‌లో సర్కారు తీరుపై మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను, సిబ్బందికి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.