క్రీడాభివృద్ధికి సహకారం
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:28 AM
బ్రిక్స్ దేశాలు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా పరస్పర సహకారంతో క్రీడాభివృద్ధికి కలిసి పనిచేయాలని క్రీడా మంత్రుల సమావేశంలో తీర్మానించారు.
బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశంలో తీర్మానం.. స్పోర్ట్స్ టెక్నాలజీ అభివృద్ధికి బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్
క్రీడా వస్తువుల తయారీ క్లస్టర్లకు ప్రోత్సాహం
అక్టోబరులో గుజరాత్‌లో బ్రిక్స్ సంప్రదాయ క్రీడలు
క్రీడా మైదానం నుంచే అవకాశాలు సృష్టించాలి
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బ్రిక్స్ దేశాలు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా పరస్పర సహకారంతో క్రీడాభివృద్ధికి కలిసి పనిచేయాలని క్రీడా మంత్రుల సమావేశంలో తీర్మానించారు. క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి సభ్యదేశాలు తమ నిబద్ధతను ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. విశాఖ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం నోవాటెల్ హోటల్‌లో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భారత బృందానికి మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య క్రీడల అభివృద్ధి, సహకారం తదితర అంశాలపై చర్చ సాగింది. క్రీడల అభివృద్ధికి భారత్ మూడు కీలకాంశాలను ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్ టెక్నాలజీ కోసం బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. క్రీడా విజ్ఞానం, క్రీడాకారుల ప్రదర్శన, ఏఐ అమలు, డిజిటల్ మార్పులు, ఆవిష్కరణల్లో సభ్యదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని, క్రీడా వస్తువుల తయారీ క్లస్టర్లకు ప్రోత్సాహం అందించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలకు మిగిలిన దేశాలు మద్దతు ప్రకటించాయి. దీనికి సంబంధించిన కాంక్లేవ్ తొలి సంచికను నవంబరులో రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కాంక్లేవ్ బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని సమావేశం అభిప్రాయపడింది.
అక్టోబరులో బ్రిక్స్ క్రీడలు..
ఈ ఏడాది అక్టోబరు 12, 13వ తేదీల్లో గుజరాత్‌లో బ్రిక్స్ సంప్రదాయ క్రీడలు నిర్వహించాలని సమావేశంలో ప్రతిపాదించారు. తద్వారా సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు, పరస్పర అవగాహనకు అవకాశం ఉంటుందని పలు దేశాల ప్రతినిధులు సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధిలో బ్రిక్స్ దేశాల మధ్య అవగాహన, సహకారం ఉండాలన్నారు. ఇది ప్రకటనలకే పరిమితం కాకుండా కోచ్‌ల మార్పిడి, ఉమ్మడిగా పోటీల నిర్వహణ, క్రీడా విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఫలప్రదం కావావాలని ఆకాక్షించారు. భారత్ క్రీడా రంగంలో సమూల మార్పులు చేస్తోందని... ఇందులో భాగంగా క్రీడా మైదానం నుంచి క్రీడా వేదిక వరకూ అనేక అవకాశాలు సృష్టిస్తోందని చెప్పారు. త్వరలో ప్రారంభించనున్న క్రీడావస్తువుల తయారీ క్లస్టర్‌కు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రపంచ తయారీదారులు, టెక్నాలజీ కంపెనీలు, పెట్టుబడిదారులు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ప్లే ఇన్ ఇండియా’, ‘గ్రో విత్ ఇండియా’లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఆదివారం ఉదయం ఆర్కే బీచ్‌లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.