బీజేపీ, టీడీపీ, జనసేన కలిసొచ్చినా ఇబ్బందేమీ లేదు
ABN , Publish Date - May 14 , 2026 | 04:15 AM
తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా తమకు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు.
ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉందనే మోదీ పర్యటించారు
రేవంత్ నిఖార్సయిన కాంగ్రెస్ నేత: టీపీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా తమకు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. ఆ మూడు పార్టీలకు కలిపి పడే ఓట్లు 30 శాతం కూడా దాటబోదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందన్న సంగతి అర్థమయ్యే ప్రధాని మోదీ పర్యటించారని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం మహేశ్‌గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ తెలంగాణలోనూ బెంగాల్ తరహాలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధాని తెలంగాణకు వస్తున్నప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అడగాలన్న సోయి బీజేపీ ఎంపీలకు లేకుండా పోయిందని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లలో పొదుపు గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సింది పోయి.. పెంచేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనతో కలిసి రావాలంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్‌రెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడని స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే.. ఆ పాత్ర పోషించకుండా ఆయన ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మంత్రి పదవి కంటే.. టీపీసీసీ చీఫ్‌గానే తాను సంతోషంగా, గర్వంగా ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా.. గాంధీభవన్‌లో బుధవారం నాయీబ్రాహ్మణ సంఘాల నేతలతో మహేశ్‌గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను సదరు నేతలు మహేశ్‌గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.