పొత్తుల్లేవ్.. ఒంటరిగానే పోటీకి సిద్ధం
ABN , Publish Date - May 16 , 2026 | 04:28 AM
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ప్రజల ఆకాంక్షల మేరకు అధికారంలోకి రాబోతున్నాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఒంటరిగా గెలిచి అధికారంలోకి వస్తామన్న నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ, పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, వైద్యులు, సినీ నటులు, న్యాయవాదులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 35 వేల పోలింగ్ బూత్‌లలో కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పిదాలను సరిచేసి, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామన్నారు. బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, అది పూర్తిగా కుటుంబ వ్యవహారమని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక పార్టీని మోసం చేసి వచ్చేవారితోనే మరో పార్టీ బలోపేతం అవుతుందనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని మండిపడ్డారు. ఒడిశా, బెంగాల్, తెలంగాణలను లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించామని, ఇక తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ తదుపరి లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాంచందర్‌రావు తార్నాక నుంచి జుబ్లీహిల్స్ వరకు మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు.