Share News

‘నాలుగు స్తంభాలాట’కు చెక్‌!

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:33 AM

రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్న ‘నాలుగు స్తంభాలాట’కు బీజేపీ జాతీయ నాయకత్వం చెక్‌ పెట్టబోతోందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై....

‘నాలుగు స్తంభాలాట’కు చెక్‌!

  • తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి

  • గ్రూపులు, విభేదాలకు ముగింపు పలకాలని నిర్ణయం

  • పాత, కొత్త పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవాలని భావన

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యాచరణకు రెడీ

  • మునిసిపల్‌ ఫలితాలపై హస్తినకు పార్టీ ముఖ్య నేతల నివేదిక

  • పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ

  • మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పొత్తుపైనా సీరియస్‌

  • సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై పలువురు నేతల అసంతృప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్న ‘నాలుగు స్తంభాలాట’కు బీజేపీ జాతీయ నాయకత్వం చెక్‌ పెట్టబోతోందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందా? కొంత మంది నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే సొంత పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ముఖ్యమని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి ఆ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్‌ రన్‌గా భావించిన మున్సిపల్‌ పోరులో కొన్నిచోట్ల ఆశించిన మేర ఫలితాలు దక్కకపోవడంపై ప్రత్యేక నివేదిక కోరిందని తెలిపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అంతర్గత కార్యాచరణతో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు అధిష్ఠానానికి తలపోటుగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కొత్త, పాత అన్న అంశం సీనియర్‌ నేతల మధ్య విభేదాలకు ప్రధాన కారణమన్న వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘కొంతమంది పదవుల కోసం, అధికారం కోసం పార్టీలు మారతారం’టూ మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్టు పార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి పోస్టులు పెట్టడమేమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలోని ఓ వర్గం తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఓ ఎంపీ వాపోయారు. క్రమశిక్షణకు మారు పేరు తమ పార్టీ అని పదే పదే ప్రకటించుకునే జాతీయ నాయకత్వం.. తప్పుడు ప్రచారం చేసిన సొంత పార్టీ వారిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని తప్పుబట్టారు.


అంతేనా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందన్న అంశాన్ని కొంతమంది నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సభలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు బీజేపీని టార్గెట్‌ చేసిన సందర్భాల్లో వాటిని సమర్థంగా తిప్పికొట్టలేకపోయారని నివేదించారు. అదే సమయంలో, ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాతీయ పార్టీ కీలక నేత ఒకరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితిని జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు పార్టీ పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించిందని వివరించాయి. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందని, క్యాడర్‌కు జోష్‌ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతోందని తెలిపాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణతో రంగంలోకి దిగబోతోందని వివరించాయి. ‘కొత్త, పాత అన్న తేడా లేదు. అంతా కమల కుటుంబమే’ అన్న నినాదాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోందని తెలిపాయి.

నివేదిక కోరిన జాతీయ నాయకత్వం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయిందన్న అంశం జాతీయ నాయకత్వం గుర్తించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కొంతమంది సీనియర్‌ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షుల వైఖరి పట్ల సీరియ్‌సగా ఉందని తెలిపాయి. పార్టీకి సంస్థాగతంగా పట్టున్న చోట్ల కూడా పేలవమైన ఫలితాలకు వారే కారణమని పేర్కొంటూ కొంతమంది ముఖ్య నేతలు హస్తినకు నివేదించినట్లు సమాచారం. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై జాతీయ నాయకత్వం ప్రత్యేక నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.


పార్టీ కార్యక్రమాలపై అభయ్‌ పాటిల్‌ సమీక్ష

పార్టీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్‌ పాటిల్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సంస్థాగత శిక్షణ తరగతులపై ఆరా తీశారు. పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన, జిల్లాల్లో పర్యటించి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్దేశించారు.

సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై నేతల అసంతృప్తి

పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ వైఖరిపైనా కొంతమంది సీనియర్‌ నాయకులు, జిల్లా పార్టీ ఇన్‌చార్జులు, అధ్యక్షులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన వైఖరిని తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, పార్టీ పదవుల్లో తమ సిఫారసులను తివారీ బుట్టదాఖలు చేయడంపై ఒకరిద్దరు ఎంపీలు రగిలిపోతున్నారు. ‘పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినా చిత్తశుద్ధితో చేస్తున్నాం. అయినా, సమీక్ష సమావేశంలో అందరినీ ఒకే గాటన కట్టినట్టుగా తివారీ మమ్మల్ని కించపరచడం మాకు అవమానం అనిపించింది’ అని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు వాపోయారు. ‘‘తివారీకి క్షేత్రస్థాయి పరిస్థితిపై అవగాహన లేదు. తెలుగు భాష అంతకన్నా రాదు. అన్నింటికీ మించి ఆయన చెప్పినట్లే చేయాలని హుకుం జారీ చేస్తారు. తప్ప సాధ్యాసాధ్యాలపై కనీసం సమీక్షించరు’’ అని మరో సీనియర్‌ నాయకుడు తప్పుబట్టారు.

Updated Date - Apr 08 , 2026 | 05:33 AM