కాంగ్రెస్ పాలనలో విమోచన దినోత్సవం కనుమరుగు
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:10 AM
ప్రజాపాలన పేరిట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేస్తోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన పేరిట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేస్తోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు సెప్టెంబరు 17న అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటయ్యాక 2022 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్రం.. ఈసారీ అత్యంత ఘనంగా జరుపుతుందని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని రైతాంగ పోరాటంగా మాత్రమే కమ్యూనిస్టులు చిత్రీకరిస్తున్నారని, ఇది వారి సంకుచిత ధోరణికి నిదర్శనమని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. న్యాయస్థానం అనుమతితో శనివారం (సెప్టెంబరు 12) నాడు బాలాపూర్ నుంచి చారిత్రక భాగ్యలక్ష్మి ఆలయం వరకు ‘తెలంగాణ విమోచన స్ఫూర్తి తిరంగా ర్యాలీ’ నిర్వహిస్తున్నామని తెలిపారు.