Share News

తెలంగాణలోనూ మాదే అధికారం

ABN , Publish Date - May 05 , 2026 | 04:16 AM

బెంగాల్‌ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. దేశంలో విభజన రాజకీయాలు చేసిన డీఎంకేకు సైతం తమిళ ఓటర్లు బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...

తెలంగాణలోనూ మాదే అధికారం

  • బెంగాల్‌ ఓటరు తీర్పు చరిత్రాత్మకం: రాంచందర్‌రావు

  • రాష్ట్రంలో బీజేపికి సానుకూల ప్రభావం: కిషన్‌రెడ్డి

  • విభజనవాదులకు గుణపాఠం: బండి సంజయ్‌

  • మోదీ నాయకత్వాన్ని బెంగాల్‌ ఆహ్వానించింది: ఈటల రాజేందర్‌

  • తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోదీ సభ: ఎంపీ అరవింద్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/సుభా్‌షనగర్‌(కరీంనగర్‌)/రాంనగర్‌(హన్మకొండ), మే 4 (ఆంధ్రజ్యోతి): బెంగాల్‌ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. దేశంలో విభజన రాజకీయాలు చేసిన డీఎంకేకు సైతం తమిళ ఓటర్లు బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీనే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకున్నందుకు కాంగ్రెస్‌కు, ఇండి కూటమికి మహిళలు గుణపాఠం చెప్పారని అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు, యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. బెంగాల్‌లో టీఎంసీ పదిహేనేళ్లుగా రాజకీయ హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. ఇప్పుడు అక్కడి ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. బీజేపీ ఏ మతానికీ, ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్‌ విజయం స్ఫూర్తి తో తెలంగాణలోనూ ప్రధాని మోదీ నేతృత్వంలో అందరం కలిసికట్టుగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి సానుకూల ప్రభావం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏళ్లలో తృణమూల్‌ ప్రభుత్వం బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిందని, సీఎంగా రేవంత్‌ పగ్గాలు చేపట్టాక కూడా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన విమర్శించారు. ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్‌లో అధికారం దక్కిందన్నారు.


తెలంగాణలో పెనుమార్పు: లక్ష్మణ్‌

తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు సంభవించబోతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిందంటూ బెంగాల్‌ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వాన్ని, అభివృద్ధి మంత్రాన్ని బెంగాల్‌ ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించారని చెప్పారు. ఇక 2028లో తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇదే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఈనెల 10న ప్రధాని మోదీ బహిరరంగ సభ నిర్వహిస్తున్నామని ఎంపీ అరవింద్‌ హన్మకొండలో తెలిపారు. బెంగాల్‌లాగే తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated Date - May 05 , 2026 | 04:16 AM