టార్గెట్.. 2 లక్షల మంది
ABN , Publish Date - May 08 , 2026 | 05:52 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభను విజయవంతం చేసేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.
ప్రధాని మోదీ సభకు భారీగా జన సమీకరణ
10న సికింద్రాబాద్ సభ కోసం కమలనాథుల కసరత్తు
గద్వాల, కాగజ్‌నగర్, ఖమ్మం మంచిర్యాల, నుంచి రైళ్లు
హైదరాబాద్, అడ్డగుట్ట, బర్కత్‌పుర, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభను విజయవంతం చేసేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. భారీ జనసమీకరణకు సంబంధించి సమన్వయం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు 33 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 10న సభ జరిగే ఆదివారం సెలవు రోజు కావడంతో అంచనాకు మించి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతల అంచనా. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో జనసమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 4 ప్రత్యేక రైళ్లు, పెద్దసంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను బుక్ చేసినట్లు సమాచారం. సిర్‌పూర్-కాగజ్‌నగర్, గద్వాల, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సభకు 2లక్షల మందిని సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు సమాచారం.
ఏర్పాట్లు పరిశీలించిన కిషన్‌రెడ్డి
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి సికింద్రాబాద్ పరేడ్ మైదానాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. హెచ్‌ఐసీసీలో శంకుస్థాపనతో పాటు జహీరాబాద్‌లో పార్కు, వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్, జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.42 రైల్వేస్టేషన్‌లు, రామగుండం ఫర్టిలైజర్లకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చెప్పారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.