Share News

భూభారతి పోర్టల్‌ రూపకల్పన డెలాయిట్‌కు

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:14 AM

భూభారతి పోర్టల్‌ రూపకల్పనలో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ప్రముఖ గ్లోబల్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకోనుంది. ఈ మేరకు ఎన్‌ఐసీ, డెలాయిట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, డేటా సమగ్రత, సైబర్‌ భద్రత ఫీచర్లతో పాటు భవిష్యత్తు అవసరాలకు..

భూభారతి పోర్టల్‌ రూపకల్పన డెలాయిట్‌కు

  • రికార్డుల్లో పారదర్శకత, సైబర్‌ భద్రతకు ప్రాధాన్యం

  • క్లౌడ్‌ నేటివ్‌ ఆర్కిటెక్చర్‌తో కొత్త పోర్టల్‌ అభివృద్ధి

  • ఎన్‌ఐసీ, డెలాయిట్‌ సంస్థ ఒప్పందం

హైదరాబాద్‌ ( ఆంధ్రజ్యోతి): భూభారతి పోర్టల్‌ రూపకల్పనలో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ప్రముఖ గ్లోబల్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకోనుంది. ఈ మేరకు ఎన్‌ఐసీ, డెలాయిట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, డేటా సమగ్రత, సైబర్‌ భద్రత ఫీచర్లతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భూభారతి పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. ఒకే సర్వే నంబరుకు ఉన్న డూప్లికేట్‌ ఎంట్రీలను తొలగించడం, యజమానుల పేర్లలో స్పెల్లింగ్‌ లోపాలను సరిచేయడం, ఆధార్‌, పాన్‌, మొబైల్‌ నంబరు లాంటి వివరాలను సంబంధిత ఏజెన్సీలతో ధ్రువీకరించడం, పాత రికార్డులను ఒకే ప్రమాణంలోకి తీసుకురావడం, ప్రతి సర్వే నంబరును జీఐఎస్‌ మ్యాప్‌తో అనుసంధానం చేయడం, శాటిలైట్‌ చిత్రాలతో భూమి స్థానాన్ని కచ్చితంగా గుర్తించడం, ఆ మ్యాప్‌పై క్లిక్‌ చేస్తే యాజమాన్య వివరాలు స్పష్టంగా కనిపించేలా చేయడం, భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలను సులభంగా గుర్తించేలా కొత్త సాంకేతికతను సమకూర్చుకోవడం ఈ ఒప్పందంలో కీలక అంశాలు. డెలాయిట్‌ సంస్థ ప్రస్తుతం ప్రభుత్వ ఈ గవర్నెన్స్‌ ప్రాజెక్టుల్లో సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, బిజినెస్‌ ప్రాసెస్‌, రీఇంజినీరింగ్‌, క్లౌడ్‌ మైగ్రేషన్‌ స్ట్రాటజీ వంటి అంశాలపై సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. డెలాయిట్‌ సంస్థ భూభారతికి సాప్ట్‌వేర్‌ను నేరుగా అందించకపోయినా పోర్టల్‌కు ఎలా రూపకల్పన చేయాలి, ఏ సాంకేతిక ప్రమాణాలు పాటించాలి, పనితీరును ఎలా మెరుగుపరచాలి అనే అంశాల్లో మార్గదర్శకత్వం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.


ధరణి పోర్టల్‌ నిర్మాణంలో ఉన్న సాంకేతిక లోపాలు, సెక్యూరిటీ లొసుగులను శాశ్వతంగా అధిగమించి, పూర్తిస్థాయు భద్రతతో కూడిన కొత్త డిజిటల్‌ వ్యవస్థ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పోర్టల్‌ పాత ఆర్కిటెక్చర్‌ను తొలగించి.. కొత్తగా ‘క్లౌడ్‌ నేటివ్‌’ ఆర్కిటెక్చర్‌తో భూభారతిని అభివృద్ధి చేయనున్నారు. గతంలో ధరణిలో జరిగినట్లుగా పోర్టల్‌లో అనధికారిక మార్పులు చేసేందుకు అవకాశం లేకుండా భూభారతి సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ రాసేందుకు డెలాయిట్‌ సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిసింది. భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను, పరిష్కారాలను కూడా లైవ్‌ ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. భూభారతి పోర్టల్‌ను ఇతర శాఖలతో అనుసంధానం చేయాలనుకుంటున్న రెవెన్యూ శాఖ ఇటీవల ఐదు గ్రామాల్లో ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ, సానుకూల ఫలితాలు రాలేదు. దీంతో ఈ పోర్టల్‌ రూపకల్పనలో డెలాయిట్‌ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది, అధికారులు ట్యాబ్‌ల ద్వారా నేరుగా ఫీల్డ్‌లోనే వివరాలు అప్‌డేట్‌ చేసే వ్యవస్థను ఈ పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 08:14 AM