వనజ చితాభస్మంలో సర్జికల్ కత్తెర
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:20 AM
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఓ సర్జికల్ కత్తెర లభ్యం కావడం...
భద్రాద్రి జిల్లాలో తల్లీబిడ్డ మృతి ఘటనలో కొత్త అనుమానం
వైద్యులు అందుబాటులో లేక ప్రసవం చేసిన నర్సు
పురిట్లోనే బిడ్డ మృతి.. తీవ్ర రక్తస్రావంతో మరణించిన వనజ
సర్జరీ చేయకుండా వనజ కడుపులోకి కత్తెర ఎలా వచ్చింది?
కుటుంబసభ్యుల అనుమానాలు.. విచారణకు డిమాండ్
గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం
గుండాల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఓ సర్జికల్ కత్తెర లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజ (20)కు గత ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా.. ఆశావర్కర్‌కు సమాచారమిచ్చినా ఆమె తన సొంత పనులు చూసుకుని ఆలస్యంగా వచ్చింది. అప్పటికే వనజను గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఫోన్ చేయగా ఆ వాహనం మరో కేసుకు వెళ్లడంతో మరో అంబులెన్సు ఆళ్లపల్లి మండలం నుంచి వచ్చేసరికి మరికొంత ఆలస్యమైంది. అనంతరం వనజను గుండాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కడుపులోని బిడ్డ కిందకు జారి ప్రసవం అవుతోందని నర్సు గమనించింది. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ నర్సే ప్రసవం చేసింది. అయితే, శిశువులో కదలిక లేకపోవడంతో ఇల్లెందు ఆస్పత్రికి తరలించగా, ఆ శిశువు పురిట్లోనే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం కావటంతో ఇల్లెందు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు చితాభస్మాన్ని ఎత్తిపోసేందుకు వెళ్లగా, ఆ చితాభస్మంలో శస్త్రచికిత్సల్లో వినియోగించే ఓ కత్తెర లభ్యమైంది. అయితే, వనజకు ఆపరేషన్ కాలేదని, రక్తస్రావం మాత్రమే జరిగితే ఆ కత్తెర ఎలా వచ్చిందని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. కడుపులో పొర (మాయ)ను తొలగించే క్రమంలో కత్తెరను కడుపులో మర్చిపోయారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వనజ మృతి ఘటనకు బాధ్యుడిని చేస్తూ గుండాల వైద్యాధికారిని గురువారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే, సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వనజ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.