Share News

బెజవాడ రూటు.. బేజారు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:31 AM

రెండు రాష్ట్రాల ప్రధాన నగరాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది.

బెజవాడ రూటు..  బేజారు!
BEJAWADA ROUTE

  • గతుకులు పడ్డ ఇరుకు సర్వీసు రోడ్లపై

నరకప్రాయంగా మారిన ప్రయాణం!

  • ఫ్లై ఓవర్ల నిర్మాణాలతోనే పనుల్లో జాప్యం

  • ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌తో హైరానా

  • డిసెంబరులో పనులు పూర్తి: కోమటిరెడ్డి

  • నల్లగొండ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల ప్రధాన నగరాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. భారీగా పెరిగిన ట్రాఫిక్‌తో నాలుగు వరుసల రోడ్డు సరిపోక పోవడం ఒక సమస్య అయితే, ఈ ఉన్న ఇబ్బందుల్లోనే పలు పట్టణాల్లో చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణం నత్తనడకన సాగడం ప్రయాణ కష్టాన్ని రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో నరకం కనిపిస్తోంది. ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న పట్టణాల్లో ప్రధాన రహదారిని మూసేసి సర్వీసు రోడ్డుకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. పైగా సర్వీస్‌ రోడ్డు అంతా గతుకులు. అందులోనే రోడ్డు మీదకు వచ్చిన దుకాణాలు. దాంతో ఏ చిన్న సమస్య వచ్చినా 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఇరుకు రోడ్డులో మెల్లగా వెళ్లే లారీలను దాటే ప్రయత్నంలో వాహనాలు రాసుకుంటూ వెళ్లడం, డ్యామేజీ అయిన వాహనాల కోసం దిగి వాదులాడుకోవడం నిత్య కృత్యంగా మారింది. సెలవు రోజులు, పండగలు, పెళ్లిళ్ల వంటి రద్దీ సమయాల్లో హైదరాబాద్‌-విజయవాడ ప్రయాణానికి పట్టే సమయానికి మరో గంట అదనంగా పడుతోంది.

ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65) చిట్యాల, చౌటుప్పల్‌ పట్టణాల నుంచి వెళుతుండటంతో పాటు పలు చోట్ల బ్లాక్‌ స్పాట్లు ఉండి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని జాతీయ రహదారుల సంస్థ గుర్తించింది. అన్నిచోట్లా ఫ్లైఓవర్లు నిర్మించడానికి పూనుకుంది. వీటిలో చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీనిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. విజయవాడ వెళుతున్నపుడు సూర్యాపేట పట్టణంలోని వంతెన దాటగానే మరో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టారు. దాదాపు పూర్తయింది. దసరాకే దీన్ని ప్రారంభిస్తామని అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. కుదిరితే వారంలోపే ప్రారంభం కావొచ్చు.


చౌటుప్పల్‌ పట్టణంలో చేపట్టిన ఓవర్‌ బ్రిడ్జి పనులు సాగుతున్న తీరుకు తోడు, కాంక్రీట్‌ పనులు సైతం పూర్తిగా చేపట్టకపోవడంతో ఈ బ్రిడ్జి పనులు ఇంకా ఏడాదిన్నర వరకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.

చిట్యాల పట్టణంలో చేపట్టిన పనులకు మట్టి కొరత ఉంది. బిల్లుల సమస్యతో కాంట్రాక్ట్‌ ఏజెన్సీ పనులను వేగంగా చేయడం లేదని, దీంతో వచ్చే సంక్రాంతికి కూడా బ్రిడ్జి పూర్తయ్యే అవకాశం లేదని అంటున్నారు.

సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్‌ రోడ్డు వద్ద చేపట్టిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, టేకుమట్ల క్రాస్‌ రోడ్డు వద్ద చేపట్టిన అండర్‌పాస్‌ బ్రిడ్జి పనులు సైతం సగానికి పైగా పూర్తయినా మట్టి కొరత, ఇతరత్రా కారణాలతో పనుల్లో వేగం లోపించిందని చెబుతున్నారు. ఈ రెండు బ్రిడ్జిల పనులు సైతం వేగంగా కొనసాగిస్తే ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ క్రాస్‌రోడ్డు అండర్‌ బ్రిడ్జి, రామాపురం క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయి. వేగంగా చేసినా ఏడెనిమిది నెలలు పడుతుందని అంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేస్తామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ మేరకు పురోగతి కనిపించడం లేదు.

డిసెంబర్‌ లోగా పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

క్షేత్ర స్థాయి పరిస్థితి చూస్తే సూర్యాపేట వంతెన తప్ప మరే వంతెనా సంక్రాంతి వరకు పూర్తయ్యే అవకాశం లేకున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం డిసెంబరు కల్లా మొత్తం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులపై తాను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నానని చెప్పారు. ఎక్కడా జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చినకాపర్తి ఫ్లైఓవర్‌ పూర్తయి అందుబాటులోకి తెచ్చామని ప్రస్తావించారు. సూర్యాపేట గాంధీపార్క్‌ ఫ్లైఓవర్‌ కూడా దాదాపు పూర్తయిందని చెప్పారు. మిగిలిన అన్నింటినీ డిసెంబర్‌లోగా పూర్తి చేయించి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Updated Date - Oct 03 , 2026 | 03:32 AM