22న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల సభ
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:35 AM
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్‌లోని ..
హాజరుకానున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు
ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ
బంజారాహిల్స్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించనున్నట్టు హాస్పిటల్ ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కె. రామ్మోహన్‌నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆస్పత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఆస్పత్రి 25 ఏళ్లుగా క్యాన్సర్ రోగులకు విజయవంతంగా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాంచ్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ‘నార్త్‌బ్లాక్’ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు క్యాన్సర్ చికిత్స పొందుతున్న చిన్నారుల మధ్య బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరానికి చెందిన సీతారామారాజు అనే దాత రూ. లక్ష.. త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు సేకరించిన రూ.1,01,116 విరాళాన్ని బాలకృష్ణకు అందచేశారు. తుళ్లూరు ఆస్పత్రి నిర్మాణం కోసం కాకర్ల రాఘవేంద్రరావు రూ. 10 లక్షల విరాళం అందజేశారు.