నీ పని నువ్వు చూసుకో
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:04 AM
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సెటైర్లు వేసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మరో నటుడు బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రతీ విషయంలో దూరి తీర్పులు ఇవ్వకు
సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్
పవన్‌కల్యాణ్‌ను విమర్శించడంపై మండిపాటు
సినిమా డెస్క్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సెటైర్లు వేసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మరో నటుడు బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయంలో దూరి తీర్పులు ఇవ్వొదని, నీ పని నువ్వు చూసుకో అని సోషల్‌మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్‌కల్యాణ్ ప్రకటనపై ఇటీవల ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర. కానీ, వచ్చేముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి’ అని ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. దానికి బండ్ల గణేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? మీరేమైనా కలెక్టరా? దేశ ప్రధానా? మీకు పని లేకపోతే వెతుక్కోండి. అంతేకానీ.. అందరి విషయాల్లో జోక్యం చేసుకొని హీరోలా ఫీలవ్వకండి. ముందు మీ అడ్రస్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యండి. ప్రతీ దానికి జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించేముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. మీ ప్రయాణం ఏంటి? మీరు సాధించింది ఏంటి? సమాజం కోసం మీరు చేసింది ఏంటి? ప్రజలు మీ వెనుక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకోండి’ అని సూచించారు. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై నటి హేమ కూడా స్పందించారు. ‘తెలంగాణలో దొర అని ఎవరిని పిలుస్తారో, మీ ఉద్దేశమేంటో అర్థమైంది. కానీ.. వ్యక్తిగత విమర్శలు సరికాదు. పవన్‌కల్యాణ్ అంటే ఏమిటో కోట్లాదిమంది ప్రజలకు తెలుసు. మీరు రాజకీయంగా కూటమి ప్రభుత్వంపై మాట్లాడవచ్చు. కానీ, ఇలా పవన్‌ను వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్స్ చేయొద్దు’ అని హితవు పలికారు.