ఆమె మైనర్ కాదు.. మేజర్!
ABN , Publish Date - May 13 , 2026 | 03:49 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్(23) తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.
పోలీసులు నాపై పోక్సో కేసు పెట్టడం చెల్లదు.. హైకోర్టులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని రెండుసార్లు ఫిర్యాదు చేశాను
కరీంనగర్‌లో రెండో కేసు పెట్టిన తర్వాతే కౌంటర్ కేసు
బ్రీజర్ తాగాలని, సెక్స్ కోసం ఒత్తిడి చేశానని ఆరోపణలు
కుట్రపూరితంగా పెట్టిన కేసు.. అరెస్టు చేసే చాన్స్ ఉంది
ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భగీరథ్.. రేపు విచారణ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్(23) తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు తప్పుడు సమాచారంతో తనపై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారని తెలిపాడు. ఫిర్యాదుదారు కుమార్తె మైనర్ కాదని, ఆమె మేజర్ అని, ఆ ఎఫ్‌ఐఆర్ దర్యాప్తునకు అర్హం కాదని పేర్కొన్నాడు. కుట్రపూరితంగా నమోదు చేసిన సదరు కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. ఈ పిటిషన్ ఈ నెల 14న (గురువారం) హైకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుట విచారణకు రానుంది.
పిటిషన్‌లో భగీరథ్ వెల్లడించిన కీలక విషయాలు..
‘‘ఫిర్యాదుదారు, వారి కుమార్తె ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారే తప్ప.. వివరాలను సరిచూసుకోలేదు. ఫిర్యాదుదారు కుమార్తె అసలు మైనర్ కాదు. ఆమెకు 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉంటుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అనేకమార్లు నాతో చెప్పింది. ప్రస్తుతం నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆమెపై 2021లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసు నమోదైంది. అప్పుడు ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. 2021లో 15 ఏళ్లు అంటే ప్రస్తుత వయసు 18 ఏళ్లలోపు ఎలా ఉంటుంది? ఆమె వయసును నిర్ధారించుకోవాలంటూ దర్యాప్తు అధికారులకు నా న్యాయవాది రిప్రజెంటేషన్ సైతం సమర్పించారు. ఆమె వయసు నిర్ధారణకు అత్యంత కీలకమైన రుజువు 2021 ఆగస్టు 21న ఆమెపై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆమెతో పరిచయం ఏర్పడింది. మా స్నేహితుల బృందంతో ఆమె విజయవాడ ఆలయం, అరుణాచలం, తిరుపతి సహా అనేక టూర్లకు వచ్చింది. ఆమె కుటుంబంతో కూడా నాకు పరిచయం ఉంది. పలుమార్లు కుటుంబ వేడుకల్లో ఆమె తల్లిదండ్రులను కలిశాం. అయితే మా మధ్య పరిచయం పెరిగిందని గమనించిన ఆమె తల్లిదండ్రులు.. నేను సమాజంలో పేరు పొందిన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తినని తెలుసుకొని రూ.5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఆ మొత్తం ఇవ్వకపోతే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని భయపెట్టారు. ఈ బెదిరింపులతో నేను కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఈ నెల 8న సాయంత్రం 5 గంటలకు నేను ఫిర్యాదు చేస్తే.. అందుకు కౌంటర్‌గా అదేరోజు రాత్రి 10 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు వివరాలతో నాపై కౌంటర్ కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుదారులు అందించిన తప్పుడు సమాచారంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని నేను హామీ ఇచ్చాననడం, ఆమె వయసు 17 ఏళ్లు అని పేర్కొనడం, గతేడాది జూన్‌లో ఆమెను నేను రిలేషన్‌షిప్‌లోకి లాగాననడం, శారీరకంగా కలుద్దామని ఒత్తిడి చేశాననడం, గతేడాది అక్టోబరు, నవంబరులో వారి నివాసంలోనే నేను ఆమెను ముద్దుపెట్టుకున్నానని, తాకానని అనడం, ఆల్కహాల్ (బ్రీజర్) తాగాలని, ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేశానని, ఆపై రిలేషన్‌షిప్ వదులుకున్నానని, ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని అనడం, నేను ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలుసుకున్నాననడం.. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఫిర్యాదుదారు కుమార్తె నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని పేర్కొంటూ తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 21న ఫిర్యాదు చేశాను. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు స్వయంగా తన ఫిర్యాదులో అంగీకరించారు. తిరిగి ఈ నెల 8న రెండో ఫిర్యాదు నమోదు చేయడంతో కౌంటర్‌గా నాపై ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుదారు అందించిన వివరాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్న విషయం ఫిర్యాదును పరిశీలిస్తే అర్థమైపోతోంది. ఓవైపు తమ కుమార్తెను సెక్స్ కోసం ఒత్తిడి చేశానని అంటూనే.. మరోవైపు మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఫిర్యాదులో అంగీకరించారు. లైంగికంగా వేధిస్తున్న వ్యక్తితో ఎవరైనా ఎలా రిలేషన్‌షి్‌పలో కొనసాగుతారనేది ఇక్కడ ప్రశ్న. అలాగే ఈ వేధింపులన్నీ గతేడాది నుంచి జరుగుతున్నాయని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత ఇన్ని నెలలకు ఫిర్యాదు ఇస్తున్నారంటే ఈ అసాధారణ ఆలస్యానికి కారణాలేంటి? నా తండ్రి రాజకీయ ప్రత్యర్థులు, అధికారంలో ఉన్న, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు నన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్లు చేయడాన్ని బట్టి చూస్తే... ఈ ఎఫ్‌ఐఆర్‌ను రాజకీయంగా దుర్వినియోగం చేయాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తప్పుడు వివరాల ఆధారంగా నమోదైన ఈ కేసులో పోలీసులు నన్ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసి న్యాయం చేయండి’’ అని పిటిషన్‌లో బండి సాయి భగీరథ్ పేర్కొన్నాడు.