నా శవంపైనా కాషాయ జెండానే కప్పాలి
ABN , Publish Date - May 21 , 2026 | 03:16 AM
నేను చనిపోయాక నా శవంపైనా కాషాయ జెండా కప్పాలన్నదే నా చివరి కోరిక. బీజేపీలో కమిట్‌మెంట్‌తో పని చేసే కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు...
బీజేపీ కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు
బీఆర్‌ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టింది మేమే
ఆ కోపంతోనే పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు
ఫేక్‌గాళ్ల ఆరోపణలపై స్పందించనక్కర్లేదు
కొడుకుపై ఆరోపణలొస్తే పోలీసులకు అప్పగించా
మీడియాతో బండి సంజయ్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను చనిపోయాక నా శవంపైనా కాషాయ జెండా కప్పాలన్నదే నా చివరి కోరిక. బీజేపీలో కమిట్‌మెంట్‌తో పని చేసే కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని, కేంద్ర కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేయబోతున్నారనే ప్రచారాలను ఆయన ఖండించారు. ఫేక్‌గాళ్ల ప్రచారాలపై స్పందించాల్సినఅవసరం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘సంజయ్.. ఆప్ సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాథ్ హై’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంజయ్‌తో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలతో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాలకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. క్యాబినెట్ నుంచి తనను తొలగించబోతున్నారనే వార్తలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘‘బీఆర్‌ఎస్ ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందేమో.. అందుకే కేసీఆర్, కేటీఆర్ నన్ను బర్తరఫ్ చేయాలని నిర్ణయించి ఉంటారు’’ అని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టామన్న కోపంతోనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘భగీరథ్ కేసు కోర్టు పరిధిలో ఉంది. పోలీసులు విచారణ కోరితే నేనే నా కొడుకును అప్పగించాను. నేను ప్రజల మధ్య ఉన్నాను. కానీ సోషల్ మీడియాలో నాపై విషప్రచారం చేస్తున్నారు. ఎన్ని తప్పుడు కథనాలు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీతోనే ఉంటారు’’అని స్పష్టం చేశారు.