ఇందిరమ్మ ఇల్లైనా ఇప్పించండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:30 AM
నిజాం వ్యతిరేక పోరాట సమయంలో ఉద్యమ రహస్యాలు చెప్పాలని రజాకార్లు ఆయనను చెట్టుకు కట్టేసి చావబాదినా, చివరికి గుండెకు తుపాకి గురిపెట్టినా ఆయన వెరవలేదు. సామ్యవాద సమాజ లక్ష్యంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కమ్యూనిస్టు పార్టీ నేతగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత సూర్యాపేట నుంచి ఏకంగా నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా సేవలందించారు.
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబం వేడుకోలు.. నిజాం వ్యతిరేక పోరులో మల్సూర్ కీలక పాత్ర
4 సార్లు సూర్యాపేట ఎమ్మెల్యేగా సేవలు
పింఛన్‌కూ దరఖాస్తు చేయని గొప్ప నేత
ప్రభుత్వ సాయం కోసం
ఎదురుచూస్తున్న కుటుంబం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిజాం వ్యతిరేక పోరాట సమయంలో ఉద్యమ రహస్యాలు చెప్పాలని రజాకార్లు ఆయనను చెట్టుకు కట్టేసి చావబాదినా, చివరికి గుండెకు తుపాకి గురిపెట్టినా ఆయన వెరవలేదు. సామ్యవాద సమాజ లక్ష్యంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కమ్యూనిస్టు పార్టీ నేతగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత సూర్యాపేట నుంచి ఏకంగా నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా సేవలందించారు. వారసత్వంగా వచ్చిన మూడు గుంటల భూమిని పాఠశాల నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన గొప్ప నేత ఉప్పల మల్సూర్. నాడు అసెంబ్లీలో పేదల గొంతు వినిపించిన ఆ ప్రజాప్రతినిధి కుటుంబానికి ఇప్పుడు నిలువ నీడ కరువైంది. మట్టి గోడలు, పెంకులపై టార్ఫాలిన్ షీట్లు, రేపో మాపో కూలిపోయేట్టుగా ఉన్న ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. 1952 నుంచి 1972 వరకు మల్సూర్ శాసనసభ సభ్యుడిగా కొనసాగారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మల్సూర్.. మాజీ ఎమ్మెల్యేల పింఛన్‌తో పాటు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌కూ అర్హులే. కానీ, మార్క్సిస్టు సిద్ధాంతం పట్ల అంకితభావంతో పెన్షన్ల కోసం ఆయన దరఖాస్తు కూడా చేయలేదు. ఆ సమయంలో మల్సూర్ అసెంబ్లీ సమావేశాల కోసం సొంతూరు సిరికొండ నుంచి కాలినడకన సూర్యాపేట వెళ్లి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ చేరుకొనేవారు. అసెంబ్లీ అయిపోగానే తిరిగి సొంతూరికి వచ్చేవారు.
కాలినడకనే నియోజకవర్గంలోని ఊర్లన్నీ తిరిగి జనం సమస్యలు తెలుసుకొనే వారు.ప్రజాప్రతినిధిగా మల్సూర్ ఎంతోమంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, భూములు ఇప్పించారు. 1999 జవనరి 13న మల్సూర్ కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమారులు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో మరణించారు. ఆయన చిన్న కోడలు పుష్పలత సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు కార్మికురాలిగా వంట పని చేస్తుంటే, మరో కోడలు యశోద వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నారు. మల్సూర్ మనుమడు (రెండో కుమారుడి సంతానం) మల్లికార్జున్ ప్రస్తుతం హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనికి వెళ్తూ, అతడి భార్య భవాని ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ‘‘మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబంగా మమ్మల్ని గుర్తించాలని అడగడం లేదు. కనీసం నిరుపేద దళితులకు వర్తింపజేసే పథకాలైనా ఇప్పించాలని ఎంతో మంది నాయకులను వేడుకున్నాం. మా గోడు పట్టించుకున్న వారే లేరు. బీఆర్‌ఎస్ హయాంలో దళిత బంధు వస్తుందనుకున్నా.. రాలేదు. ఇందిరమ్మ ఇల్లైనా ఇచ్చి మమ్నల్ని ఆదుకోవాలి’’ అని పుష్పలత కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ఇప్పుడున్న ఇల్లు కూడా మా మేనత్త నర్సమ్మ ఇచ్చింది. మా నాయిన మాకు ఇచ్చింది మంచి పేరు ఒక్కటే. సరైన వైద్యం చేయించుకోలేక చిన్న వయసులోనే నా ఇద్దరు తమ్ముళ్లు చనిపోయారు. వర్షం పడితే ఇల్లంతా కురుస్తుంది. మట్టి గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దయతలచి ఇల్లు కట్టుకోడానికి సాయం అందించాలి’’ అని మల్సూర్ కుమార్తె కొమురమ్మ కోరారు.