అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీల్లో సగం అమలే కాలేదు!
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:03 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటిదాకా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల్లో సగానికిపైగా అమలే కాలేదు. తెలంగాణ తొలి శాసనసభ నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ వేదికగా వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, మంత్రులు 2,266 హామీలు ఇవ్వగా..
12 ఏళ్లలో 2,266 హామీలిచ్చిన ప్రభుత్వాలు..
ఇంకా పెండింగ్‌లోనే ఉన్న 1174 హామీలు
వీటిలో 750 హామీలు గత ప్రభుత్వంలో ఇచ్చినవే!
శాసనసభ హామీల అమలు కమిటీ భేటీలో వెల్లడి
తొలిసారిగా సమావేశమైన నియమాల కమిటీ, నైతిక విలువలు, హామీల అమలు కమిటీలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటిదాకా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల్లో సగానికిపైగా అమలే కాలేదు. తెలంగాణ తొలి శాసనసభ నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ వేదికగా వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, మంత్రులు 2,266 హామీలు ఇవ్వగా.. వీటిలో 1,092 మాత్రమే అమలయ్యాయి. ఇంకా 1174 హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాగా, పెండింగ్‌లో ఉన్న హామీల్లో 750 హామీలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చినవేనని శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఇటీవల నియామకం జరిగిన శాసనసభ హామీల అమలు, నిబంధనలు, నైతిక విలువల కమిటీలు.. మంగళవారం తొలిసారిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులతోపాటు స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. అనంతరం సీఎల్పీ మీడియా హాల్‌లో పటోళ్ల సంజీవరెడ్డి సమావేశాల వివరాలను వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కాగా, ఆయా కమిటీల సభ్యులనుద్దేశించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీదని, శాసనసభను ప్రజాస్వామ్యబద్ధంగా, సమర్థంగా నిర్వహించడంలో నియమాల అమలు కమిటీది కీలక బాధ్యత అని పేర్కొన్నారు. . రాగద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా కమిటీలు పనిచేయాలని సూచించారు.
రూల్స్ బుక్‌కు అనుగుణంగా శాసనసభ..
శాసనసభలో సభ్యులకు మొదటిగా ఇచ్చేది రూల్స్ బుక్ అని, దానికి అనుగుణంగా స్పీకర్ శాసనసభను నడుపుతారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కానీ, గత ప్రభుత్వంలో రూల్స్ బుక్‌ను మార్చివేశారన్నారు. శాసనసభను సమర్థంగా నడపడానికి రూల్స్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలిసి నూతన నిబంధనలతో రూల్స్ బుక్‌ను రూపొందించాలని సూచించారు. శాసనసభ కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ర్టాల శాసనసభలలో అమలవుతున్న నిబంధనల్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశాల్లో హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు అనిరుధ్‌రెడ్డి, జారె ఆదినారాయణ, నైతిక విలువల కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి, సభ్యుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ చైర్మన్‌గా ఉన్న నియమాల కమిటీ సభ్యులు దానం నాగేందర్, తూడి మేఘారెడ్డి, భూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు.