Share News

వాచీల ఖరీదు 94.5 లక్షలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:10 AM

రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు, ఒక విలాసవంతమైన కారు, ఇంకా లెక్కల్లో చూపని నగదు, అనుమానాస్పద జాయింట్‌ వెంచర్‌ ఒప్పందాలు, నగదు లావాదేవీల పత్రాలు, ఆస్తి పత్రాలు..

వాచీల ఖరీదు 94.5 లక్షలు

  • లిక్కర్‌ రవాణా స్కామ్‌ నిందితుల ఇళ్లలో స్వాధీనం

  • ఇంకా విలాసవంతమైన కారు, నగదు, పత్రాలూ

  • నాడు అడ్డగోలుగా లిక్కర్‌ రవాణా చార్జీల పెంపు

  • అంతా తానై చక్రం తిప్పిన రాజ్‌ కసిరెడ్డి

  • సహకరించిన మాజీ ఎండీ వాసుదేవరెడ్డి

  • మనీలాండరింగ్‌ కోణం వివరించిన ఈడీ

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు, ఒక విలాసవంతమైన కారు, ఇంకా లెక్కల్లో చూపని నగదు, అనుమానాస్పద జాయింట్‌ వెంచర్‌ ఒప్పందాలు, నగదు లావాదేవీల పత్రాలు, ఆస్తి పత్రాలు.. లిక్కర్‌ రవాణా స్కామ్‌ నిందితుల ఇళ్లలో బయటపడ్డాయి. నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా టెండర్లలో జరిగిన భారీ అక్రమాల కేసులో ఈడీ అధికారులు గురువారం కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్కామ్‌లో మనీలాండరింగ్‌ కోణాన్ని ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. కసిరెడ్డి రాజ శేఖర్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి, విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌ కుమార్‌లకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని వివరించారు. ఈ సందర్భంగా ఖరీదైన వాచీలు, ఓ కారు, నగదుతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించింది. ఏపీఎ్‌సబీసీఎల్‌ లిక్కర్‌ రవాణా టెండర్‌ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చిందని తెలిపింది. సిగ్మా సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీఎస్‌పీఎల్‌), ఆ తర్వాత ప్రసాద్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది.


ఈ సంస్థలను కేవలం ముందుపెట్టి.. వాస్తవ ఆర్థిక, నిర్వహణ నియంత్రణ రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి అనుచరుల చేతుల్లోనే పెట్టుకున్నట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌ కసిరెడ్డి, తుకేకుల ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అంజనీ కుమార్‌లు కలిసి అప్పటి ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి సహకారంతో మార్కెట్‌ రేట్ల కంటే అధిక ధరలకు లిక్కర్‌ రవాణా టెండర్లు దక్కించుకున్నారు. అక్రమంగా భారీ లాభాలు పొందారు. రాజ్‌ కసిరెడ్డి ఈ మొత్తం కుట్రకు సూత్రధారిగా వ్యవహరించాడు. గత జగన్‌ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారుగా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వాసుదేవ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కుట్ర పన్ని లిక్కర్‌ రవాణా టెండర్లను తమకు అనుకూలంగా మలచుకున్నాడు. జిల్లాల వారీగా అమల్లో ఉన్న వికేంద్రీకృత రవాణా విధానాన్ని రద్దు చేసి, రాష్ట్రవ్యాప్తంగా కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేయడానికి కుట్ర పన్నారు. ఈ ప్రక్రియలో ఒక్కో కార్టన్‌(బాక్సు) రవాణా సగటు ధర రూ.19.68 ఉండగా, దానిని రూ.35.57 వరకు పెంచి సిండికేట్‌కు భారీ లాభాలు చేకూర్చినట్లు ఈడీ గుర్తించింది. వాసుదేవ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేశారని ఈడీ వెల్లడించింది. టెండర్‌ గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆమోదం లేకుండానే ఒప్పందాలకు పదేపదే పొడిగింపులు ఇచ్చారని పేర్కొంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపింది. పీఎంఎల్‌ఏ దర్యాప్తులో ేసకరించిన ఆధారాల మేరకు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించామని, దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ పేర్కొంది.

Updated Date - Jun 13 , 2026 | 04:13 AM