మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:37 PM
మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు.
- కలెక్టర్ కె హరిత
- ఘనంగా మహిళ దినోత్సవం
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు ఉదయ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు. ప్రతీ మహిళా చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని వివరించారు. గతంతో పోలిస్తే రాజకీయ రంగాల్లో మహిళలు కొంత రాణిస్తున్నారని మరింత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటికీ మహిళల ఆలోచన తీరు పూర్తిగా మారడం లేదన్నారు. ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు కలెక్టర్, ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎస్‌టీవో కరుణ శ్రీ, మహిళా సంఘం సభ్యురాలు స్వరూపలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్, కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని కాగజ్‌నగర్‌రూరల్ సీఐ కుమారస్వామి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళా ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, కుటుంబాలకు, సమాజానికి మహిళలు ప్రేరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జూరు: మండలంలోని సలుగుపల్లిలో మహిళా సంఘం, గ్రామ స్థానిక సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో గ్రామస్థులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సంఘం నాయకులు జ్యోతి, విజయనిర్మల మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.