Share News

సాగునీటి సంఘాలకు పూర్వవైభవం దక్కేనా?

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:40 PM

సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వాటికి పూర్వవైభవం తెస్తామని గత సెప్టెంబరు చివరి వారంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.

సాగునీటి సంఘాలకు పూర్వవైభవం దక్కేనా?

- కలగానేఎన్నికల నిర్వహణ

- సంఘాల ఏర్పాటుతో జలాశయాలకు పూర్వవైభవం

బెజ్జూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వాటికి పూర్వవైభవం తెస్తామని గత సెప్టెంబరు చివరి వారంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించేందుకు సన్నాహాలు చేసింది. స్థానిక సమరం పూర్తయ్యాక సాగునీటి సంఘాలపై దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకొని కన్వీనర్లుగా నీటిపారుదలశాఖ అధికారులను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి సంఘాల పరిధిలో లష్కర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి తొమ్మిది నెలలు కావస్తున్నా ఆచరణలో అమలుకు చర్యలు చేపట్టలేదు.

జిల్లాలో 563 చెరువులు..

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లావ్యాప్తంగా 100ఎకరాలకు పైగా ఉన్న చెరువులు147 ఉన్నాయి. 100ఎకరాల లోపు 416చెరువులు ఉన్నాయి. మెత్తం 563ఉన్నాయి. ఇప్పటికే రైతులంతా ఖరీఫ్‌ సాగుకు శ్రీకారం చుడుతుండగా, వర్షాలు కురిస్తే చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు నిండే అవకాశం ఉంటుంది. సాగునీటి సంఘాలు లేకపోవడంతో ఆయకట్టు కింద రైతులు సాగుచేసే పంటలకు సరైన పర్యవేక్షణ లేనికారణంగా సాగునీరు అందకుండా పోతోంది. సంఘాలు ఉన్నట్లయితే ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికలు అయ్యాక సాగునీటి సంఘాలకు ఎన్నికలకు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. స్థానిక సమరంతో పాటు పురపోరు కూడా పూర్తయినా సాగునీటి సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో పునాది....

నీటి వనరుల నిర్వహణలో వారిని భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 1997లో తొలిసారి సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ఆధీనంలోని చెరువులు, ప్రాజెక్టులకు సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. నీటివనరులను స్థానిక రైతులే నిర్వహించుకునే లక్ష్యంతో అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. జలాశయాల పరిధిలో సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు ఏర్పాటు చేసింది. ఆయకట్టు రైతులు సంఘాలకు సభ్యులు అందులో నుంచి అధ్యక్షులను ఎన్నుకొని కన్వీనర్లుగా అధికారులు ఉండి సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాలకు నేరుగా నిధులు విడుదల చేయడంతో కాలువలకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చూసేవి. సంఘాలకు మూడేళ్ల కాలపరిమితి విధించారు. ఆలస్యంగా రెండోసారి 2004లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతుండటంతో పాత సంఘాలనే కొనసాగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పట్టించుకోకపోవడం మూలంగా ఎన్నికలు జరగలేదు. తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి ఏర్పాటుపై మళ్లీ దృష్టి సారించేందుకు ప్రయత్నం చేసినా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

కోల్పోయిన ఉనికి...

ప్రభుత్వం పట్టించుకున్నంత కాలం చురుగ్గా పని చేసిన సాగునీటి సంఘాలు తర్వాత ఉనికి కోల్పోయాయి. పంట కాల్వల మరమ్మతులు, నీటిపారుదల రైతులకు సమస్యగా మారింది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పనుల్లో రైతుల భాగస్వామ్యం, పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాల ఏర్పాటు చేసినట్లయితే ఉపయోగంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

సంఘాలు ఉన్న సమయంలో....

ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఏర్పాటు చేసిన సాగునీటి సంఘాలు ఉన్నప్పుడు కాలువలు, చెరువు కట్టలు, తూముల సమస్యలు, మరమ్మతులు సంఘం సభ్యులే చేసేవారు. భారీ వర్షాలు కురిసినప్పుడు జలవనరులకు నష్టం కలగకుండా సంఘాలు బాధ్యతగా పనిచేశాయి. పంట కాలువలకు క్రమపద్ధతిలో సాగు నీరందించేవారు. దీంతో చెరువులు, ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీటిపై పూర్తిగా పట్టించుకోకపోవడంతో సాగునీటి సంఘాలు నిర్వీర్యమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి సంఘాలకు పూర్వవైభవం తెచ్చి చెరువులు, ప్రాజెక్టులను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.

Updated Date - Jun 20 , 2026 | 11:40 PM