Share News

ఇంటర్‌ విద్య అందేనా?

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:12 PM

ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ విద్య జిల్లాలోని మారుమూల గ్రామాల విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగులుతోంది.

ఇంటర్‌ విద్య అందేనా?

- జిల్లాలో వేధిస్తున్న జూనియర్‌ కళాశాలల కొరత

- కొత్త మండలాల్లో ప్రతిపాదనలకే పరిమితం

- గ్రామీణ విద్యార్థులకు అందని ప్రభుత్వ విధ్య

- ప్రైవేటును ఆశ్రయించక తప్పని పరిస్థితి

మంచిర్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ విద్య జిల్లాలోని మారుమూల గ్రామాల విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగులుతోంది. విద్యా రంగానికి అఽధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త కళాశాలలు ప్రారంభించడంలో పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఈ పరిస్ధితి తీవ్రంగా ఉంది. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక కార్పొరేషన్‌, మరో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మంచిర్యాల విద్యారంగంలో ప్రముఖ స్థానం కలిగి ఉంది. ఉన్నత పాఠశాలలు, కాలేజీలు వందల సంఖ్యలో ఉండగా ప్రభుత్వ కళాశాలలు మాత్రం విద్యార్థులకు అందనంత దూరంలో ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు రకరకాల ఆఫర్లతో విద్యార్థులను ఆకర్షిస్తుండగా, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కూడా ఊహించని విధంగా అడ్మిషనలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో విద్యార్థులు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఈకారణం చేత ప్రైవేటులో ఇంటర్‌ విద్యను కొనాల్సిరావడంతో పోషకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

- 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు..

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 63 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 10 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, బీసీ వెల్ఫేర్‌ కాలేజీలు, సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలు, రెసిడెన్షియల్‌ కళాశాల, మైనార్టీ కాలేజీలు, మోడల్‌ స్కూల్‌ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 40 ఉన్నాయి. అలాగే ప్రైవేటు అన ఎయిడెడ్‌ కళాశాలలు మరో 13 ఉన్నాయి. వీటిలో 2025-2026 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలతోపాటు ఒకేషనల్‌ కోర్సులో రెండు సంవత్సరాలకు సంబంధించి 12వేల పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసించారు. ప్రభుత్వ కళాశాలలో అన్ని అర్హతలున్న అధ్యాపకులు, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంత కాలం విద్యార్థులు ఆ వైపు మొగ్గు చూపలేదు. ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యకు స్కాలర్‌షిప్‌ ఇస్తుండటంతో ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు. ప్రభుత్వం మంజూరు చేసే ఫీజుపైనే ఆధారపడి అనేక కాలేజీలు విద్యార్థులను చేర్చుకోగా, పోషకులకు సైతం ఉచిత విద్య అందడంతో ప్రైవేటు కాలేజీలను ఆశ్రయించేవారు. మూడు, నాలుగు సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు రాగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల వైపు తల్లిదండ్రుల దృష్టి మళ్లుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ సకాలంలో విడుదల చేయని కారణంగా ఫీజుల కోసం యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఉచితంగా విద్యను అందించే ప్రభుత్వ కళాశాల ల్లో చేరేందుకు విద్యార్థులు, పోషకులు మొగ్గు చూపుతున్నారు.

వేలల్లో పదోతరగతి ఉత్తీర్ణులు...

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, మైనార్టీ, సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూళ్లతోపాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు తొమ్మిది వేల పైచిలుకు మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అధిక శాతం మంది 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసించనున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రభుత్వ కళాశాలలు లేనందున ప్రైవేటును ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

నూతన కళాశాలల ఏర్పాటు ఎప్పుడు?

జిల్లావ్యాప్తంగా మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, ప్రాంతాల్లోనే అధిక శాతం కళాశాలలు ఉండగా మారుమూల మండలాలు, గ్రామాల విద్యార్థులు వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆయా ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించాల్సి వస్తోంది. జిల్లాలోని భీమిని, తాండూరు, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల తదితర పాత మండలాల్లోనూ ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. వీటికి తోడు కొత్తగా ఏర్పడ్డ మండలాలైన హాజీపూర్‌, నస్పూర్‌, భీమారం, కన్నెపల్లి మండలాల్లో కళాశాలలు ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా మండలాల్లో ప్రభుత్వపరంగా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉండగా, ఆ ప్రక్రియ ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రతీ మండలానికి ఒక కాలేజీ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇంటర్‌ బోర్డు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు కూడా తెప్పించుకుంది. అయితే వేసవి సెలవులు పూర్తయి, నూతన విద్యాసంవత్సరం కూడా ప్రారంభమైనా ఇప్పటి వరకు కళాశాలలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ విషయమై దృష్టి సారించి ఆయా మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ప్రతిపాదనలు పంపించాం..

- అంజయ్య, డీఐఈవో

తొమ్మిది మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు పదినెలల క్రితం ప్రతిపాదనలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు పంపించాం. వీటితోపాటు పాత మండలాలైన భీమిని, తాండూరు, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెలతోపాటు కొత్త మండలాలు హాజీపూర్‌, భీమారం, కన్నెపల్లిలో ఒక్కో కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు జరగలేదు.

Updated Date - Jun 25 , 2026 | 11:12 PM