పంట మార్పిడి జరిగేనా?
ABN , Publish Date - May 16 , 2026 | 11:11 PM
జిల్లావ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో పప్పు దినుసులు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
- జిల్లాలో గణనీయంగా పెరుగుతున్న వరి, పత్తి సాగు
- పడిపోతున్న కూరగాయలు, పప్పు దినుసుల సేద్యం
- తోటలు సైతం కనుమరుగవుతున్న పరిస్థితి
బెజ్జూరు, మే 16(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో పప్పు దినుసులు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఆహార పదార్థాలకు తీవ్రకొరత వాటిల్లే ప్రమాదముంది. పంటల మార్పిడిపై జిల్లా రైతాంగానికి వ్యవసాయశాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. రైతులు అధిక శాతం వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్న కారణంగా తీవ్ర కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంటల మార్పిడి అత్యవసరమని నివేదిక సమర్పించింది. ప్రతీ వానాకాలం సీజన్‌లో వరి, పత్తి పంటలు అత్యధికంగా సాగవుతుండగా యాసంగిలో సైతం వరి అత్యధికంగా సాగవుతోంది. ఏటా వరి, పత్తి విస్తీర్ణం పెరుగుతుండగా, కూరగాయల సాగు తగ్గిపోతోంది. సుస్థిర వ్యవసాయం, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం, సహజవనరుల సంరక్షణ, భవిష్యత్‌లో ఆహార భద్రత కోసం పంటల మార్పిడి తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తున్నారు.
వాతావరణానికి అనుకూలంగా ప్రణాళికలు...
జిల్లాలో వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటల ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. పంటల మార్పిడి లక్ష్యాలను గ్రామాలవారీగా నిర్ణయిస్తేనే ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం యోచించింది. గత ప్రభుత్వ హయాంలో కూరగాయల హబ్‌గా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ సరిహద్దు గ్రామాల్లో పెద్దమొత్తంలో సాగుచేయాలని నిర్ణయించి నా ఆ తరువాత ప్రణాళిక నిలిచిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. కూరగాయల సాగు కేవలం జిల్లా వ్యాప్తంగా 2,000 నుంచి 3,000 ఎకరాల్లో మాత్రమే ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలు మండిపోతున్నాయి. పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలుకూడా గణనీయంగా పడిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తప్పడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ‘రైతువారం’ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. వరి, పత్తి దిగుబడులు పెరుగుతుండటంతో భవిష్యత్‌లో కొనుగోలు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పంటల మార్పిడిపై దృష్టి సారించింది. ఇప్పటికే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో రైతులకు పంటల మార్పిడిపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు.
తగ్గిపోతున్న పండ్ల తోటల విస్తీర్ణం...
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లాలోని రైతులు పెద్దగా పండ్ల తోటల పెంపకానికి మొగ్గు చూపడం లేదు. జిల్లాలో కేవలం కాగజ్‌నగర్ మండలంలోని జంబుగలో మాత్రమే కొంతమేర పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. అక్కడక్కడా మామిడి తోటలు పెంచేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తుండగా, మిగితా వాటి ఊసే లేదు. జిల్లాలో అతి తక్కువ ఎకరాల్లోనే పండ్ల తోటలు సాగు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. రైతులు పండ్ల, కూరగాయల తోటలు తొలగించి అధిక మొత్తంలో వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నారు.
పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నాం...
- నాగరాజు, ఏవో, బెజ్జూరు
సాగులో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకే పంట వేయడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పంటలపై ప్రభావం చూపిస్తోంది. పంట మార్పిడి చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు రైతు వారోత్సవాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలు చేపడుతున్నాం. పంటల మార్పిడితోనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఒకేపంట సాగు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఉద్యాన పంటలు సాగుచేయాలి. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటల మార్పిడికి చర్యలు తీసుకుంటున్నాం.