Share News

కో ఆప్షన్‌ పదవులు వరించేదెవరినో..

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:31 PM

మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్‌ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

కో ఆప్షన్‌ పదవులు వరించేదెవరినో..

- పదవులపై పలువురు నాయకులు ఆశలు

- త్వరలో నోటిఫికేషన్‌ విడుదలకు ఛాన్స్‌

- ఒక్కో మునిసిపాలిటీలో నలుగురికి అవకాశం

- ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

మంచిర్యాల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్‌ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో కో ఆప్షన్‌ పదవులకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు ఎన్నికలు జరిగిన చెన్నూరు, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో కో ఆప్షన్‌ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. కాగా క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడినందున కో ఆప్షన్‌ పదవుల భర్తీ చేస్తారా...? లేదా....? చర్చ నడుస్తోంది.

కార్పొరేషన్‌ పరిధిలో పెరగనున్న సంఖ్య....

కో ఆప్షన్‌ పదవులు త్వరలో భర్తీ కానున్న నేపథ్యంలో ఎంతమందికి అవకాశం కల్పిస్తారోనన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ఒక్కో మునిసిపాలిటీ పరిధిలో నలుగురికి కో ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. అలాగే కార్పొరేషన్‌ పరిధిలో కనీసం నలుగురు నుంచి ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించే వెసులుబాటు ఉన్నది. ఈ లెక్కన మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 20 పైచిలుకు కో ఆప్షన్‌ పదవులు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో మునిసిపాలిటీలో ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులను మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. అయితే మునిసిపాలిటీ గ్రేడ్‌ను బట్టి సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంది. అలాగే కార్పొరేషన్‌ పరిధిలో నలుగురిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉండగా, అదనంగా మరో ముగ్గురికి కూడా అవకాశం కల్పించే వెసులుబాటు ఉంటుంది.

అర్హతలు ఇవి..

మునిసిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికలో పలు నిబంధనలను పాటించ వలసి ఉంటుంది. ఒక్కో మునిసిపాలిటీ పరిధిలో నలుగురు సభ్యులను నియమించిన పక్షంలో....వారిలో పరిపాలన అనుభవం కలిగిన వారికి రెండు పోస్టులు కేటాయిస్తుండగా, అందులో ఒకటి మహిళకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కో ఆప్షన్‌ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఓటరు జాబితాలో రిజిష్టర్‌ అయి ఉండటంతోపాటు 21 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. మున్సిపల్‌ కౌన్సిల్‌లో చైర్మన్‌ మొదలుకొని వార్డు సభ్యుని వరకు ఎందులోనైనా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా పాలన సాగించి ఉండాలి. అలాగే అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన వారికి మరో రెండు పోస్టులు కేటాయిస్తారు. అందులో కూడా ఒక పోస్టును మహిళకు రిజర్వు చేసే ఛాన్స్‌ ఉంది. ఈ పదవులకు దరఖాస్తులు చేసే అభ్యర్థులు ఓటర్‌ జాబితాలో రిజిష్టర్‌ అయి ఉండటంతోపాటు 21 సంవత్సరముల పైబడి వయస్సు ఉండాలి. ఆశావహులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారై ఉండాలి. అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలతోపాటు రుజువు పత్రాలతో నిర్ణీత తేదీలోపు కమిషనర్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్‌ మైనారిటీ వర్గానికి చెందిన వారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేసి గెజిటెడ్‌ అధికారి హోదాలో రిటైర్‌ అయిన ఉద్యోగులు, అలాగే ఐదేళ్లకన్నా తక్కువ కాకుండా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, వార్డు సభ్యుడిగా పని చేసిన మాజీ ప్రజాప్రతినిధులు కో ఆప్షన్‌ సభ్యుల పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులుగా అయిదేళ్లు పని చేసిన ప్రజాప్రతినిధులు అర్హులు. కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి కౌన్సిలర్లతో సమానంగా హోదా, అధికారాలు ఉంటాయి. గౌరవ వేతనం కూడా లభిస్తుంది. మునిసిపల్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వీరికి అవకాశం ఉంటుంది.

ఎమ్మెల్యేల హామీతో...

జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలకు చెంది కో ఆప్షన్‌ పదవులు ఆశించే వారు ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేల చేతుల్లోనే కో ఆప్షన్‌ పదవుల భర్తీ ఉండటంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు వివిధ మునిసిపాలిటీల్లో ఎన్నికల సమయంలో కొందరికి ఎమ్మెల్యేలు కో ఆప్షన్‌ పదవులు ఇస్తామని హామీ సైతం ఇచ్చారు. ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పదవులకు విపరీతమైన పోటీ నెలకొనడంతో ఒకేచోట ఇద్దరు, ముగ్గురు బరిలో ఉన్న స్థానాల్లో ముఖ్యులకు పలువురికి కో ఆప్షన్‌ పదవుల పేరుతో బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేల హామీతో కౌన్సిల్‌ బరి నుంచి తప్పుకున్న వారు ప్రస్తుతం కో ఆప్షన్‌ పదవులు ఆశిస్తున్నారు. దీంతో అలాంటి వారికి ఎమ్మెల్యేలు కో ఆప్షన్‌ పదవులు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.

Updated Date - Feb 21 , 2026 | 11:32 PM