వార్డు అధికారులు ఎక్కడ?
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:56 PM
మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు.
- కార్యాలయాలకే పరిమితం
- వార్డుల్లో క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
బెల్లంపల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని ప్రతీ వార్డుకు ఒక్కో వార్డు ఆఫీసర్‌ను కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ అధికారులు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలావరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని ఫలితంగా వార్డుల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారిందంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువైన నేపథ్యంలో వార్డు అధికారుల పనితీరు మెరుగుపరిచే విధంగా ప్రజా ప్రతినిధులతో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
- అస్తవ్యస్తంగా వార్డులు...
పట్టణంలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వార్డు పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ అంతంతా మాత్రంగానే ఉంటుందనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. కోతులు, కుక్కల బెడద పెరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సమస్య తీవ్రతను వార్డు అధికారులే ఉన్నతాధికారులకు నివేదించి చొరవ చూపాల్సి ఉంది. కానీ వార్డు అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే ఆయా వార్డుల్లో వీధిదీపాలు సైతం పనిచేయడం లేదు. దీంతో రాత్రివేళల్లో ఆయా వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు చెత్త ట్రాలీలు సైతం ప్రతిరోజు చెత్త సేకరణకు రాకపోవడంతో రహదారుల పక్కన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అలాగే మురుగు కాల్వలు సైతం రోడ్లపై పారుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యభారిన పడుతున్నారు.
- విధులపై దృష్టి సారించక..
మున్సిపాలిటిల్లో వార్డు ఆఫీసర్లు ప్రతి రోజు వారికి కేటాయించిన వార్దును సందర్శించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డు ఆఫీసర్లు కేవలం కార్యాలయానికే పరిమితమవుతూ తమకు కేటాయించిన విధులపై అంతగా దృష్టి సారించడం లేదు. మున్సిపాలిటిలోని వార్డుప్రజల సమస్యల పరిస్కారం కోసం, వార్డుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వార్డు ఆఫీసర్లను కేటాయించారు. వారికి పలు విధులను సైతం నిర్దేశించారు. పారిశుధ్య కార్మికుల పనులను పర్యవేక్షించడం, సమయానుకూ లంగా కార్మికుల విధులు అప్పగించడం, పారిశుధ్య ప్రణాళిక అమలు చేయడం, ఇంటింటికి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణను పక్కాగ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం, మాంసవిక్రయాల దుకాణాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం, ప్రభుత్వం సూచించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటితో పాటు వీధి దీపాలు, నీటి సరఫరాను పర్యవేక్షించడం, ఆసరా పింఛన్లు, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా చూడడం, ఆస్తి పన్ను సక్రమంగా అమలయ్యేలా చూడడం, వార్డుల్లో కావాల్సిన సౌకర్యాలు, వసతులు, ఇతర అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నర్సరీలు, మొక్కల పెంపకం వంటి విధులు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. కాని పలువురు వార్డు అధికారులు ఇష్టారీతిన విధులు నిర్వహి స్తుండడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- వార్డు అధికారుల కొరత...
జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో వార్డు అధికారుల కొరత ఉంది. ఒక్కోవార్డుకు ఒక్కో వార్డు ఆఫీసర్ ఉండాల్సి ఉండగా వార్డు అధికారులు లేకపోవడంతో వార్డుప్రజలు సంక్షేమ పథకాల విషయంలో, పారిశుధ్యం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల కార్పొరేషనలో మొత్తం 60 వార్డులు ఉండగా 56 మంది వార్డు ఆఫీసర్లు ఉన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటిలో 34 వార్డులు ఉండగా కేవలం 17 మంది వార్డు ఆఫీసర్లే ఉన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటిలో 15వార్డులు ఉండగా కేవలం ఇద్దరు, చెన్నూర్ మున్సిపాలిటిలో 18వార్డులు ఉండగా కేవలం ముగ్గురు, క్యాతనపల్లి మన్సిపాలిటిలో 22 వార్డులు ఉండగా తొమ్మిది మంది, మందమర్రి మున్సిపాలిటిలో 24 వార్డులు ఉండగా 13 మంది వార్డు ఆఫీసర్లే ఉన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో వార్డు ఆఫీసర్లను కేటాయించి సమస్యలు పరిస్కరించే విధంగా చూడాలని మున్సిపాలిటిలోని ప్రజలు కోరుతున్నారు.