కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడో...?
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:31 PM
రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది.
-చేయూత పథకం కింద పెంచుతామని మంత్రి హామీ
- అర్హుల జాబితాను సిద్ధం చేసిన యంత్రాంగం
- గత ఆగస్టు 1వ తేదీ నుంచే ఇస్తామని ప్రకటన
- ఆరు నెలలైనా ముందుకు సాగని ప్రక్రియ
మంచిర్యాల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే ఆరు నెలల గడుస్తున్నా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఎప్పుడెప్పుడు అందజేస్తారోనని లబ్ధిదారులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే పింఛన్‌దారుల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఆయా దరఖాస్తులతోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పింఛన్ లిస్టు కూడా పరిగణలోనికి తీసుకోవడం ద్వారా అర్హుల జాబితా తయారు చేయాలనే ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చేనేత, పైలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం కింద 2,016 రూపాయలు, దివ్యాంగులకు 3,016 రూపాయలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, ఇతరులకు నాలుగు వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
అర్హుల జాబితా సిద్ధం చేసినా..!
మంత్రి ఆదేశాలతో చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల అర్హత జాబితాకు తుది మెరుగులు దిద్దిన అధికారులు దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేద ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది. చేయూత పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడంతో ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయి తుది జాబితా ప్రభుత్వం వద్ద సిదత్ధింగా ఉంది. ఆ జాబితా అఽధారంగా కొత్త పింఛన్లు లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది.
జిల్లాలో పది లక్షలకు పైగా దరఖాస్తులు...
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 10లక్షల 84వేల 479 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. దరఖాస్తుల్లో చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అంగవైకల్యం కింద మొత్తం 6,591 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. అలాగే ఇతర విభాగాలకు చెందిన పింఛన్ల కోసం 50,467 దరఖాస్తులు అర్హత సాధించాయి. చేయూత పథకంలో భాగంగా అంగవైకల్యం కింద జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు 3 కోట్ల 95 లక్షల 46 వేల రూపాయలు అవసరం కాగా ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు 20 కోట్ల 18 లక్షల 68 వేల రూపాయలు అవసరం అవుతాయి. అలాగే ఇతర పథకాలకు సంబంధించి 10 లక్షల 27వేల 421 మందికి లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఇందులో గృహిణులకు రూ. 2,500 పథకం కింద 2,10,614 దరఖాస్తులు ఫైనల్ కాగా, వంటగ్యాస్ కింద 2,13,023, రైతులకు రూ. 15,000 పథకం కింద 93,632, కౌలు రైతులకు రూ. 15,000 పథకం కింద 10,596, రూ. 12,000 పథకం కింద 1,06,365, 323 చదరపు గజాల ఇంటి స్థలం పథకం కింద 323, ఉద్యమకారులకు ఇంటి స్థలం పథకం కింద 2,534, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 2,534 దరఖాస్తులు అర్హత పొందాయి. ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తే అర్హులైన దరఖాస్తుదారులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది.