అసైన్డ్ భూముల లెక్క తేలేదెప్పుడో?
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:32 PM
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో... అసైన్డ్ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్ సర్కారు అధికారులను ఆదేశించింది.
- జిల్లాలో పెద్ద ఎత్తున భూములు అన్యాక్రాంతం
- విచ్చలవిడిగా వెంచర్లు చేసి ప్లాట్ల అమ్మకాలు
- వెలిసిన ఫంక్షన్ హాళ్లు, శాశ్వత భవనాలు
- ఏజెన్సీ భూములనూ వదలని రియల్టర్లు
మంచిర్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో... అసైన్డ్ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్ సర్కారు అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమేరకు భూములు అసైన్ చేయబడ్డాయి, ఎక్కెడెక్కడ ఆ భూములును ప్లాట్లుగా మార్చారు..? ఎన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి...? అనే అంశాలపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావించింది. సర్కారు ఆదేశాలతో అసైన్డ్ భూముల లెక్క పక్కాగా తేలాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ దిశగా కార్యాచరణ చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి...? అవి ఎవరి చేతిలో ఉన్నాయి....? ఎన్ని పరాధీనం అయ్యాయి....? అనే లెక్కలు లేవు. గత ప్రభుత్వాలు ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు చేయలేదు. అసలు అసైన్డ్ భూములపై గత బీఆర్‌ఎస్ సర్కారు పెద్దగా ధృష్టిసారించలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ధరణి రాకతో ఇష్టారాజ్యం...
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తరువాత కబ్జాదారులు కోట్ల విలువైన అసైన్డ్ భూములను అప్పనంగా కాజేజి, వాటిలో దర్జాగా వెంచర్లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకున్నారు. ఒకసారి అవి రెగ్యులరైజ్ అయితే శాశ్వతంగా వారి సొంతమైనట్లే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపాలిటీల వద్ద పెండింగులో ఉండగా, ఒక్క మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వందల సంఖ్యలో వీఎల్టీ (వేకేట్ ల్యాండ్ ట్యాక్స్) ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వేలసంఖ్యలో వీఎల్టీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతానికి 2020 ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే ఆ అవకాశం కల్పించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి.
అసైన్డ్ భూముల లెక్కలపై ఆరా...
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేటప్పుడు అసైన్డ్ భూములపైనా ప్రధానంగా ధృష్టిసారించాలని రేవంత్ సర్కారు కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఆమోదం కోసం క్షేత్రస్థాయిలో జరిపే పరిశీలనలో మున్సిపల్ అధికారులకుతోడు రెవెన్యూ, నీటిపారుదల శాఖకు భాగస్వామ్యం కల్పించింది. గతంలో కేవలం మున్సిపాలిటీ అధికారులు, లేదంటే వారి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే పరిశీలన జరిపేవారు. దరఖాస్తు చేసుకున్న స్థలాలు అసైన్డ్ భూములా...? కాదా...? అనేది తమకు అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం మాత్రమే ధ్రువీకరించుకునేవారు. మున్సిపాలిటీ వద్ద ఉన్న అరకొర రికార్డుల వల్ల కొన్నిసార్లు అసైన్డ్ స్థలాలు సైతం రెగ్యులరైజ్ అయిన ఉదంతాలు ఉన్నాయి. దీనికి తోడు కొందరు మున్సిపల్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది క్షేత్రపరిశీలనలో అవి అసైన్డ్ భూములు అని తేలినా ముడుపులకు ఆశపడి రెగ్యులర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని ధృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో మున్సిపల్ శాఖతోపాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖలను కూడా భాగస్వాములను చేసింది.
పూర్తిస్థాయిలో దరఖాస్తుల పరిశీలన...
గతంలో మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందితి క్షేత్రస్థాయిలో పరిశీలించేవారు. కొత్త ఆదేశాల మేరకు ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది. మున్సిపల్ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌తో పాటు నీటిపారుదల శాఖ ఏఈ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కలిసి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అది ప్రభుత్వతి భూమా? ఆసైన్డ్ భూమా? ప్రైవేటు స్థలామా.? వివాదాలు ఏమైనా ఉన్నాయా? అనేది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గుర్తించాల్సి ఉంది. బఫర్ జోన్ నిబంధనల మేరకు చెరువులు, కుంటలు, వాగులు, నాలాల పక్క నుంచి ఎంత దూరంలో ఉంది...? అనుమతులు ఇవ్వాలా లేదా అనేది నీటిపారుదల శాఖ ఏఈ పర్యవేక్షించాలి. ఆ స్థలం నివాస ప్రాంతం (రెసిడెన్షియల్ ఏరియా), వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం.... ఇలా ఏ జోన్‌లోకి వస్తుంది, జత చేసిన పత్రాలు సరియైనవా...కావా అనేది పట్టణ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్ గుర్తిస్తారు. వీరు ముగ్గురు అమోదించాకే ఎల్ 1 లాగిన్ నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి (ఎల్2 లాగిన్)కి దరఖాస్తును పంపిస్తారు. అక్కడి నుంచి ఎల్ 3 లాగిన్ పర్యవేక్షించే మున్సిపల్ కమిషనర్‌కు వెళుతుంది. రుసుం చెల్లించాక కమిషనర్ ఆమోదంతో ఎల్‌ఆర్‌ఎస్ పత్రం జారీ చేస్తారు. పెద్ద లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ రికార్డులను ఎల్ 4 దశలో భాగంగా కలెక్టర్ల పరిశీలనకు పంపుతారు.
అసైన్డ్ భూముల్లో రియల్ వెంచర్లు...
జీవనోపాధి కోసం ప్రభుత్వం అర్హతగల వారికి పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో విచ్చలవిడిగా ప్లాట్ల వెంచర్లు వెలిశాయి. జిల్లా కేంధ్రంలోని నస్పూర్‌లో గల సర్వే నంబర్లు 42, 64లలోని అసైన్డ్ భూముల్లో బడా వెంచర్లు వెలిశాయి. మందమర్రి పట్టణంలో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం జరిగింది. అంతేకాదు గిరిజన చట్టాల ప్రకారం అర్హులైన పేదలకు పంపిణీ చేసిన భూములను సైతం వదలిపెట్టలేదంటే అతిశయోక్తికాదు. 1966 కంటే ముందు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములకు ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు)లు జారీ అయ్యాయి. దాన్ని అవకాశంగా మలుచుకొని కొందరు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇదే అదునుగా కొందరు నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి అమ్మడానికి వీలులేని భూములను అన్యాక్రాంతం చేశారు. జిల్లాలోని దండేపల్లి, మందమర్రి మండలాల్లో గిరిజన భూముల్లోనూ వెంచర్లు వెలిశాయి.
చర్యలు శూన్యం...
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో అసైన్డ్ భూములని తేలినప్పటికీ వాటిని స్వాధీన పరుచుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. కొన్ని చోట్లా శాశ్వతంగా వెలిసిన కట్టడాలు అసైన్డ్ భూముల్లో ఉన్నట్లు తేలినప్పటికీ చర్యలు తీసుకొనే పరిస్థితి లేదు. అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు రాజకీయ పలుకుబడి కలిగి ఉండటంతో చర్యలు చేపట్టేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. అదే సామాన్య ప్రజలు తెలిసో...తెలియకనో అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే తమ ప్రతాపం చూపించే అధికారులు బడా వ్యక్తుల జోలికి మాత్రం వెళ్లడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన వెంచర్లలో ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్లు కొన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదల నుంచి అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసి ఇష్టారీతిన విక్రయించారు. వ్యాపారుల వలలో పడి భూమి స్వభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే గుడ్డిగా ప్లాట్లు కొనుగోలు చేసినవారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై అధికారులు కఠినంగా వ్యవహిస్తే జిల్లావ్యాప్తంగా కబ్జాలకు గురైన మరిన్ని అసైన్డ్ భూములు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.