Share News

పాలు పొంగించే వేళాయె...

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:14 PM

నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

 పాలు పొంగించే వేళాయె...
నెన్నెల మండలం నందులపల్లిలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు

- ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరిన సొంతింటి కల

- సామూహిక గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు

- ఈ నెల మూడో వారంలో ముహూర్తం

నెన్నెల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సామూహిక గృహప్రవేశాల వేడుకను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకలో పాల్గొననున్నారు. గడువు వరకు ప్లోరింగ్‌ వేసి, డోర్లు, కిటికీలు ఏర్పాటు చేసి రంగులు వేయించి సిద్ధంగా ఉండాలని హౌసింగ్‌ అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. బిల్లులు సైతం పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు అందజేస్తూ పనులను ప్రోత్సహిస్తున్నారు. ఫైనల్‌ బిల్లు కోసం పనులు మొత్తం కావాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. స్లాబ్‌ వేసి ఇంటి బయటి గోడలకు ప్లాస్టింగ్‌ చేస్తే బిల్లులు ఇవ్వాలనే వెసులుబాటు కల్పించింది. దీంతో తుది బిల్లును ముందుగానే తీసుకొని పెండింగ్‌ పనులు, తుదిమెరుగులు దిద్దుకోవచ్చు. పనులు పూర్తి చేసుకొని కొత్త ఇంట్లో పాలుపొంగించే వేళ సమీపిస్తుండటంతో లబ్ధిదారుల మోములో సంతోషం వెల్లివిరిస్తోంది.

- 341 ఇళ్ల నిర్మాణం పూర్తి..

మంచిర్యాల జిల్లాకు మొదటి విడతలో మొత్తం 11,083 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 8,112 ఇళ్ల పనులు ప్రారంభం కాగా 6,571 ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. 4,351 రూఫ్‌ లెవల్‌ వరకు పనులు అయ్యాయి. 3,038 గృహాలు స్లాబ్‌ లెవల్‌లో ఉన్నాయి. 341 ఇళ్లు నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. స్లాబ్‌ లెవల్‌తో పాటు, పనులు తుది దశకు చేరుకున్న వాటిని పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బన్సీలాల్‌ పేర్కొన్నారు. పనులు వెనుకబడిన వాటిని జూన్‌ నెలలో ప్రారంభించుకునేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

అధికారుల ప్రత్యేక చొరవ..

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. నివాస్థలం ఉండి, ఇళ్లు లేని నిరుపేదలకు మొదటి విడతలో ఇళ్లను కేటాయించారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహాల నిర్మాణం పూర్తయ్యేంత వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇళ్ల నిర్మాణం పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, లబ్ధిదారులకు బిల్లులు నేరుగా చెల్లించేందుకు ప్రత్యేక ఇందిరమ్మ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందిస్తోంది. నిర్మాణ దశను బట్టి నాలుగు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. పనుల పురోగతిని ఆన్‌లైన్‌ చేసిన వెంటనే బిల్లులు ఇస్తూ అధికారులు సైతం పనులు పూర్తి చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అధిక వర్షాలు, ఇసుక, మేస్త్రీల కొరత కారణంగ కొన్నాళ్ల పాటు పనులు మందకొడిగా నడిచాయి. కాని గృహనిర్మాణ శాఖ అధికారులు, ప్రజాప్రతినిదుల చొరవతో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పనుల్లో పురోగతి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సహా మండల ప్రత్యేక అధికారులు, హౌసింగ్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. టెక్నికల్‌ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి బిల్లులు చెల్లిస్తున్నారు.

చాలా సంతోషంగా ఉంది

గడ్డం పెంటాగౌడ్‌, లబ్ధిదారుడు, నెన్నెల

నేను గీతా కార్మికుడిని. కులవృత్తితో జీవనం సాగిస్తున్నాను. సొంతిళ్లు కట్టుకునే తాహతు లేక పెంకుటింట్లో నివాసం ఉంటున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. బిల్లులు ఎప్పటికప్పుడు ఖాతాలో జమ కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తి చేసుకున్నా. గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రభుత్వ సాయంతో సొంతింటి కల నెరవేరడంతో చాలా సంతోషంగా ఉంది.

Updated Date - Apr 08 , 2026 | 11:14 PM