Share News

సుందరీకరణకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - May 12 , 2026 | 10:29 PM

జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక పార్కు రాముని చెరువు సుందరీకరణ పనులకు సంవత్సరాలు గడుస్తు న్నా మోక్షం లభించడంలేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు సెలవులు, ఖాళీ సమయాల్లో ఉల్లాసంగా గడపలేని పరిస్థితి నెలకొంది.

సుందరీకరణకు మోక్షమెప్పుడో?

- సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాముని చెరువు పనులు

- మురుగు నీటి తొలగింపులో తీవ్ర జాప్యం

- వర్షాలు కురిస్తే అర్ధాంతరంగా వదలాల్సిన పరిస్థితి

- రూ.3.50 కోట్లు కేటాయించినా ముందుకు సాగని పనులు

మంచిర్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక పార్కు రాముని చెరువు సుందరీకరణ పనులకు సంవత్సరాలు గడుస్తు న్నా మోక్షం లభించడంలేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు సెలవులు, ఖాళీ సమయాల్లో ఉల్లాసంగా గడపలేని పరిస్థితి నెలకొంది. గతంలో చెరువు కట్ట ఇరువైపులా పచ్చని చెట్లు, వీధిలైట్లు, కూర్చునేందుకు బెంచీలతో కళకళలాడేది. సందర్శకులతో నిత్యంబిజీగా ఉండేది. ముఖ్యంగా సంధ్యా సమయాల్లో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణాన్ని అందజేసేది. వృద్ధులు, వాకర్స్‌ కాలక్షేపం కోసం చెరువు కట్టపై గంటల తరబడి గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. సుందరీకరణ పేరుతో చేపడుతున్న పనుల్లో జాప్యం కారణంగా చెరువు ప్రాంతం కళావిహీనంగా దర్శనమిస్తోంది. డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు నీటి కారణంగా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మురుగు నీరు తొలగింపులో జాప్యం..

చెరువు సుందరీకరణలో భాగంగా మొదట వివిధ ప్రాంతాల నంచి వచ్చే డ్రైనేజీల మురుగు నీటిని పూర్తిగా తొలగించి, పూడికతీయాలని ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చెరువు అడుగు భాగం నుంచి శుభ్రం చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈక్రమంలో చెరువుకు పడమర వైపు ఫుట్‌ వే బ్రిడ్జి వద్ద దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మత్తడికి గండి కొట్టారు. అందులో నుంచి మురుగు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా మురుగు నీటిని బయటకు పంపకపోగా, సుందరీకణ పనులు కూడా వేగం పుంజుకోవడం లేదు. చెరువు సుందరీకరణపై అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. వేసవి, శీతాకాలంలో గండి నుంచి నీరు బయటకు వెళ్తుండగా, తిరిగి వర్షాకాలంలో పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. పైగా ఇటీవల మత్తడికి చేసిన గండిని కూడా పూర్తిగా మూసివేశారు. దీంతో చెరువులోని మురుగునీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మురుగు నీటిని తొలగిస్తామని చెబుతున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం వేసవికాలం అయినందున నీటినంతా బయటకు పంపి, పూడిక తీయిస్తే చెరువు మొత్తం ఖాళీ అయి, వర్షాకాలంలో కొత్తనీరు చేరే అవకాశం ఉంటుంది.

సుందరీకరణకు రూ. 3.50 కోట్లు మంజూరు...

రాముని చెరువు సుందరీకరణ కోసం నాలుగేళ్ల కిందట టీయూఎఫ్‌ఐడీసీ (తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) నుంచి రూ 3.50 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టవలసి ఉండగా, తాత్సారం చేయడంతో చెరువు అభివృద్దికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు, డీపీఆర్‌ తయారీ, టెండర్ల నిర్వహణ అంటూ దాదాపు రెండు సంవత్సరాలపాటు పనులు చేపట్టలేదు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడక జరుగుతుండటంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు కట్టపై వాకింగ్‌ ట్రాక్‌, రెండు పక్కల ఇనుప గ్రిల్స్‌, హైటెక్‌సిటీ, జాఫర్‌నగర్‌ ప్రాంతాల నుంచి చెరువులో బతుకమ్మల నిమజ్జనం కోసం మెట్ల నిర్మాణం, తదితర పనులు చేపట్టవలసి ఉంది. ఇందులో కేవలం ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తికాగా, రెండు చోట్లా మెట్ల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, ప్రజలు సేదదీరేందుకు బెంచీల ఏర్పాటు, కట్టవెంట విద్యుత్‌ దీపాలు ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. చెరువులో పెరిగిన గుర్రపు డెక్క, తామర, పిచ్చిమొక్కలతో పూడికతీత పనులు ముందుకు సాగడం లేదు. ఈ వేసవిలోపు పనులన్నీ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.

బోటింగ్‌ ఊసేది..?

సుందరీకరణలో భాగంగా రాముని చెరువులో ప్రస్తుతం ఉన్న మురుగునీరు, పూడికనంతా తొలగించి, కొత్త నీటితో నింపాలని నిర్ణయించారు. అలా చెరువును శుద్ధి చేసిన అనంతరం అందులో టూరిజం శాఖ నుంచి బోటింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా పార్కుగా అభివృద్ది చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు అందుబాటులో ఉన్న ఏకైక చెరువు కావడంతో అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా అభివృద్ధి చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. రాముని చెరువులో బోటింగ్‌, ఇతర ఏర్పాట్లు చేస్తే ప్రజలకు ఆహ్లాదకర వాతారణం కల్పించినట్లు అవుతుంది. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలకు శాపంగా మారింది. చెరువు కట్టపై వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా, అపనులు కూడా మరుగున పడ్డాయి. పట్టణంలోని హైటెక్‌సిటీ, జన్మభూమి నగర్‌, లక్ష్మీనగర్‌, గౌతమీనగర్‌, జాఫర్‌ నగర్‌ కాలనీల ప్రజలు చెరువు కట్టపై వాకింగ్‌ చేస్తుంటారు. నిత్యం వందలాది మంది ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2017లో అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సుమారు రూ. 80 లక్షలతో చెరువు అభివృద్ధికి పూనుకున్నారు. చెరువు చుట్టూ కట్ట నిర్మించి, మట్టితో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయించారు. వాకింగ్‌ ట్రాక్‌ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది. కాలక్రమంలో నిర్వహణ లోపంతో కట్టపై పిచ్చి మొక్కలు మొలవడంతో ప్రజలు అక్కడికి రావడం మానేశారు. పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక చెరువు కావడంతో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2026 | 10:29 PM