జూనియర్ కళాశాల ప్రారంభం ఎప్పుడు?
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:28 PM
మండలంలో ప్రతి సంవత్సరం సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తున్నారు. వీరు ఇంటర్ చదవాలంటే మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో బెల్లంపల్లి పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది.
- గత సంవత్సరమే మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే
- ఇప్పటికీ పురోగతిలేని వైనం
- దూర ప్రాంతానికి వెళ్లలేక చదువు మానేస్తున్న విద్యార్థులు
తాండూర్, జూన 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రతి సంవత్సరం సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తున్నారు. వీరు ఇంటర్ చదవాలంటే మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో బెల్లంపల్లి పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. మండలం నుంచి బెల్లంపల్లికి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో దూర ప్రాంతానికి వెళ్లి చదవలేక కొంత మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు. గత సంవత్సరం జూనియర్ కళాశాల మండలానికి మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని రోజుల క్రితం మండలంలోని విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేకు కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. అయినా కళాశాల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కళాశాలను ప్రారంభిస్తే ఇప్పటికే అడ్మిషనలు ప్రారంభమయ్యేవి. కానీ కళాశాలను ఇంకా ప్రారంభించకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి ఇంటర్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఆర్థిక స్తోమత లేక..
తాండూర్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ చదవాలంటే బెల్లంపల్లి, ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఉంది. రోజు ఖర్చులు భరించి వెళ్లేంత ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు చదువుకోవాలని ఉన్నా చదవలేకపోతున్నారు. దీంతో సామాన్య, నిరుపేద విద్యార్థులు పదో తరగతితోనే చదువును ఆపేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలని నిబంధన ఉన్నా ఇప్పటి వరకు తాండూర్‌లో ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సంబంధిత పత్రాలు అందజేసినా ఇప్పటివరకు కళాశాల ప్రారంభంలో ఎలాంటి పురోగతి లేదు. ఈ విద్యా సంవత్సరం కూడా కళాశాల లేనట్లేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం మండలంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నారు. వీరంతా ఇతర ప్రాంతాలకు వెళితేనే ఇంటర్ చదువుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి తాండూర్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
కళాశాలను ఏర్పాటు చేయాలి
- బోడ సతీష్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు
ఈ విద్యా సంవత్సరం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. తాత్కాలిక భవనంలోనైనా కళాశాలను ప్రారంభిస్తే ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్ చదవడానికి బెల్లంపల్లికి వెళ్లాలంటే విద్యార్థులకు ఖర్చుతో కూడుకున్నది. బెల్లంపల్లికి వెళ్లి చదవలేని విద్యార్థులు చదువును ఆపివేస్తున్నారు. వెంటనే కళాశాలను ప్రారంభించి అడ్మిషనలు స్వీకరించాలి.
- కలెక్టర్ భూమి కేటాయించారు
అంజయ్య, డీఐఈవో
తాండూర్ మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కలెక్టర్ భూమిని కేటాయించారు. కాలేజీ ప్రారంభానికి ఫీజు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు కళాశాలకు సంబంధించిన అన్ని పత్రాలను అందజేశాం. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.