జాతర రైళ్లేవి..?
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:30 PM
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపించేది.
- మేడారం మహాజాతర సమీపిస్తున్నా వెలువడని ప్రకటన
- ప్రత్యేక రైళ్ల కోసం భక్తుల ఎదురుచూపులు
- గతంలో నడిచిన రైళ్లు
- ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం
మంచిర్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపించేది. ప్రస్తుతం జాతర నిర్వహణ తేదీలు సమీపిస్తున్నా... రైల్వే అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో మేడారం వెళ్లే భక్తులు అసహనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జిల్లాలోని పలు బస్టాండ్ల నుంచి జాతరకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు ఈ నెల 25 నుంచి జాతర ముగిసే వరకు నిరంతరాయంగా నడవనున్నాయి. అయితే రైల్వేశాఖ మాత్రం నిర్లిప్తతతో ఉండటంతో చార్జీల రూపేణ భక్తులపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే రైళ్ల రాకపోకలు మొదలై ఉంటే సుదూర ప్రాంత భక్తులకు రోడ్డు మార్గం కష్టాలు తప్పేవి.
- ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు....
మేడారం జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. ముఖ్యంగా జిల్లా వాసులతోపాటు మంచిర్యాల మీదుగా సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షల నుంచి వేలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారు. జాతరకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపితే బస్సు ప్రయాణ దూరం తగ్గుతుంది. వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు మంచిర్యాల మీదుగా వరంగల్, కాజీపేట, మహబూబాబాద్ వరకు రైళ్లలో వెళ్లి, అక్కడి నుంచి బస్సుల్లో మేడారం వెళ్లే అవకాశం ఉంటుంది. పైగా రవాణా భారం కూడా ప్రయాణికులపై తగ్గుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మంచిర్యాల నుంచి మేడారం ప్రయాణించాలంటే ఒక్కొక్కరికి రూ. 500 వరకు చార్జీ చేస్తారు. అదే రైళ్లలో అయితే గరిష్టంగా రూ. 200లోపే టికెట్ ధర ఉంటుండగా, భక్తులపై భారం తగ్గుతుంది.
- తప్పని ఇబ్బందులు...
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపే విషయంలో రైల్వేశాఖ ఇప్పటికైనా మేల్కొంటే భక్తుల ఇబ్బందులు తొలగించినట్లవుతుంది. ప్రత్యేక రైళ్లు లేనందున రోజు వారీ నడిచే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించక తప్పడంలేదు. జాతర సమయాల్లో రైళ్ల విపరీతమైన రద్దీ కారణంగా సాధారణ ప్రయాణిలకు అసౌకర్యం కలుగుతుంది. గతంలో మేడారం మహా జాతరకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాగజ్‌నగర్-వరంగల్ మధ్య పలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 2016, 2018, 2022, 2024 జాతర సందర్భంగా భక్తులు ప్రత్యేక రైళ్ల సేవలు వినియోగించుకున్నారు. కొవిడ్-19 వ్యాప్తి ఉన్నప్పుడు 2020లో ప్రత్యేక రైళ్లు నడవలేదు. ఈ నెల 28 నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుండగా, మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు కేటాయించాలనే డిమాండ్‌లు భక్తుల నుంచి ఉన్నాయి.
ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలి...
కె. ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు
ఆసియాలోనే అత్యంత ఘనంగా నిర్వహించే మేడారం జాతర సమీపిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపించాలి. ఈ విషయమై సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో అధికారులను కలిసి విన్నవించాము. బల్లార్షా-సిర్పూర్ కాగజ్‌నగర్-బెల్లంపల్లి-మంచిర్యాల-పెద్దపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలి.