Share News

ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:36 PM

ఇంటర్‌ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ప్రైవేటుకు ధీటుగా బోధనను మెరుగుపచ్చడమే కాకుండా విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి కృషి చేస్తోంది.

ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు

- ప్రభుత్వానికి ప్రతిపాదనలు

- కిట్‌లో రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య, పుస్తకాలు, ఇతర సామగ్రి

- ఆమోదిస్తే జూన్‌ 1 నుంచి అమలుకు సన్నాహాలు

వాంకిడి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ప్రైవేటుకు ధీటుగా బోధనను మెరుగుపచ్చడమే కాకుండా విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు అందించాలని ఇంటర్‌ విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి పలురకాల ప్రతిపాదనలు అందించింది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యాసంవ త్సరం జూన్‌ 1వ తేదీనుంచి వెల్‌కమ్‌ కిట్లు అందించనున్నారు.

- ఏకరూప దుస్తులు, పుస్తకాలు...

వెల్‌కమ్‌ కిట్‌లో రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య, పుస్తకాలు, రికార్డు పుస్తకాలతో పాటు అవసరమైన ఇతర వస్తువులు అందించనున్నారు. గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదివే వారికి ప్రభుత్వం ఏకరూప దుస్తులు ఇస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారికి అందించడంలేదు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేవారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పేదవారే ఉంటున్నారు. యూనిఫాం, పలురకాల పుస్తకాలు కొనాలంటే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి ఇది అమలైతే జిల్లాలోని 11 కళాశాలల్లో దాదాపు మూడు వేలకు పైగా మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలు పెరిగే అవకాశాముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- సీడబ్ల్యూఎస్‌ఎన్‌ పిల్లలకు ఈ-స్కూటర్లు

ప్రభుత్వ కళాశాలల్లో చేరిన ప్రత్యేకావసరాల విద్యార్థులకు ఈ - స్కూటర్లు అందించాలని ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు పంపింది. వీళ్లు మధ్యలో చదువు మానేయకుండా ఎంతో ఉపయోగపడతాయని అధికారులు బావిస్తున్నారు. అలాగే పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరిన వారికి ఉపకార వేతనాలు అందించాలని ప్రతిపాదించారు.

- ప్రవేశాలు పెరగడానికి ఉపయోగపడతాయి

చంద్రయ్య, ప్రిన్సిపాల్‌, వాంకిడి

ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు అందజేస్తే కళాశాలల్లో ప్రవేశాలు పెరగడానికి ఎంతో దోహదపడతాయి. నిరుపేద విద్యార్థులు ప్రతీ సంవత్సరం దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కిట్లు ఇవ్వడంవల్ల నిరుపేద విద్యార్థుల తల్లి దండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇది అమలైతే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.

Updated Date - Mar 09 , 2026 | 11:36 PM