Share News

రాముని చెరువును కాపాడుకోవాలి

ABN , Publish Date - May 24 , 2026 | 11:21 PM

రాముని చెరువు కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని బీజేపీ నాయకుడు తుల మధుసూదన్‌రావు పేర్కొన్నారు.

రాముని చెరువును కాపాడుకోవాలి
చెరువు వద్ద నిరసన తెలుపుతున్న నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాముని చెరువు కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని బీజేపీ నాయకుడు తుల మధుసూదన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాముని చెరువు కట్టపైన, కట్ట అభివృద్ధి పనులపై జరుగుతున్న అవకతవకలపై నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం కింద చెరువుల పరిరక్షణ కోసం రాముని చెరువుకు రూ. 1.98 కోట్లు మంజూరు చేసిందన్నారు. వాటిని అధికారులు అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టకుండా అనవసర ఖర్చులు పెడుతున్నారని విమర్శించారు. ఒక పక్క చెరువు ఉనికి ప్రమాదకరంగా మారి హైటెక్‌ సిటీ వైపు చెరువును కొద్దికొద్దిగా పూడ్చే కార్యక్రమాన్ని కొందరు అక్రమార్కులు చేపడుతుండగా దాన్ని అధికారులు అడ్డుకోవడం లేదన్నారు. మరోపక్క హైద్రాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు రాముని చెరువులోని కొంత భాగాన్ని ఇస్తున్నామని అధికారులు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. చెరువులను పూడ్చి మైదానాలు చేయడం చట్టవిరుద్ధమని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే స్పందించి చెరువుకు సంబంధించిన 47 ఎకరాల 32 గుంటల స్థలాన్ని గుర్తించి కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మున్నారాజా సిసోడియా, కర్రె లచ్చన్న, మల్లయ్య, రాజయ్య, హరికృష్ణ, రమేష్‌, సురేష్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:21 PM