గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:07 AM
గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు.
- నెలరోజుల పాటు పశువులకు వ్యాక్సినేషన్
- జిల్లాకు చేరిన 2. 60లక్షల డోసులు
బెజ్జూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు. కాగా వ్యాధి నివారణకు ఈ నెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 9వరకు టీకాలు వేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు వ్యాక్సిన్లు సరఫరా చేయగా వాటిని పశువైద్యశాలల్లో నిల్వ చేశారు. నెలరోజుల పాటు టీకాలు చల్లని గదిలోనే ఉంచుతున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయిస్తున్నారు.
రైతులపై ఆర్థిక భారం...
గాలికుంటు వ్యాధితో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గుతుంది. వైద్యఖర్చులు పెరుగుతాయి. పశువులు కూడా బలహీనపడతాయి. చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుంది. కోలుకున్న తర్వాత కూడా పశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతాయి. పశువుల ఉత్పాదక శక్తి క్రమంగా తగ్గి రైతులకు నష్టం జరుగుతుంది.
జిల్లాలో 2,73,940పశువులు...
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 28 పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో ఆవులు, ఎద్దులు 2,32,402, గేదెలు 41,538 ఉన్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, మూడు నెలల దాటిన లేగ దూడలకు గాలికుంటు వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి అప్తోస్ వైరస్ వల్ల పశువులకు సంక్రమిస్తుందని వైద్యులు అంటున్నారు. వైరస్ సంక్రమణ తర్వాత పశువుల్లో నోరు, చిగుళ్లు, కాళ్ల గోళ్ల మధ్య పొక్కుల వల్ల తీవ్రమైన జ్వరం వస్తుంది. చొంగ కార్చడం, మేత మేయకపోవడం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి ఆరోగ్యకరమైన పశువులకు గాలి, నీరు, మేత ద్వారా, దూడలకు వ్యాప్తి చెందుతుంది.
ఏప్రిల్ 9 వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్...
జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీ వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. ఈ మేరకు జిల్లాకు 2లక్షల 60వేల డోసుల టీకాలు సరఫరా చేశారు. వాటిని జిల్లాలోని పశువైద్యశాలల్లో నిల్వ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతిరోజు ఒక మండలంలో రెండు లేదా మూడు బృందాలు పశువులకు టీకాలు వేస్తున్నాయి. టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారితో పాటు ఆయా మండలాల పశువైద్య అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన తర్వాత సంబంధిత సిబ్బంది వివరాలను నిర్ణీత యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సిబ్బందికి అవసరమైన సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో వ్యక్తిగత సెల్‌ఫొన్లలోనే అప్‌లోడ్ చేస్తున్నారు. సమర్థవంతమైన సెల్‌ఫోన్లు లేకపోవడంవల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు.
పకడ్బందీగా టీకాలు...
- డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా పశువైద్యాధికారి, ఆసిఫాబాద్
జిల్లాలో గాలికుంటు వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. వ్యాధి నివారణకు పాడి రైతులు సహకరించాలి. టీకాల కార్యక్రమాన్ని నెలరోజుల పాటు నిర్వహిస్తున్నాం. రైతులకు ముందుగానే సమాచారం ఇస్తున్నాం.