Share News

ట్రేడర్స్‌ మాయాజాలం

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:46 PM

మార్కెట్లో వ్యాపార నిమిత్తం సాగించే సామగ్రి కొనుగోళ్లు, అమ్మకాలు, వస్తు మార్పిడి, సేవలు, కార్యాలయాలు, రిటైల్‌ ఔట్‌లెట్లకు సంబంధించి వాటి నిర్వాహకులు విధిగా సంబంధిత కార్యాలయ అధికారులతో ట్రేడ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలనే నిబంధన ఉంది.

ట్రేడర్స్‌ మాయాజాలం

- లైసెన్స్‌ లేకుండానే యథేచ్ఛగా వ్యాపారం

- విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న దుకాణాలు

- బడా సంస్థలదీ అదే ఒరవడి

- ఆదాయానికి గండిపడుతున్నా పట్టని అధికారులు

మంచిర్యాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో వ్యాపార నిమిత్తం సాగించే సామగ్రి కొనుగోళ్లు, అమ్మకాలు, వస్తు మార్పిడి, సేవలు, కార్యాలయాలు, రిటైల్‌ ఔట్‌లెట్లకు సంబంధించి వాటి నిర్వాహకులు విధిగా సంబంధిత కార్యాలయ అధికారులతో ట్రేడ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలనే నిబంధన ఉంది. లైసెన్స్‌ ఉంటేనే బహిరంగంగా పై విధమైన వ్యాపారాలు చేసేందుకైనా వెసులుబాటు కలుగుతుంది. లైసెన్స్‌ పొందడం కోసం సదరు వ్యాపార సంస్థల నిర్వాహకులు నిబంధనల మేరకు నిర్ణీత రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలతో కూడిన లైసెన్స్‌ పొందిన తరువాత సంవత్సరానికి ఒకసారి రెన్యూవల్‌ కూడా చేయించుకోవలసి ఉంటుంది. లైసెన్స్‌ కాలపరిమితి ప్రతియేడు మార్చి 31 వరకు ముగుస్తుండగా, వారం రోజుల ముందే రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేయాలి. గడువు ముగిసన తరువాత రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు మూడు నెలల వరకు 25 శాతం, ఆ తరువాత నుంచి 50 శాతం వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలా వ్యాపార సంస్థలకు ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ చేసే అధికారం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఉంటుంది. లైసెన్స్‌లు జారీచేయడం ద్వారా లభించే సొమ్మును ఆయా సంస్థలు తమ ఖజానాలో జమ చేసుకుంటాయి. తమ పరిధిలోని వ్యాపారసంస్థలకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఉందా? రెన్యూవల్‌ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా...? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించే బాధ్యత కూడా ఆయా స్థానిక సంస్థలపైనే ఉంటుంది. పై నిబంధనలను వ్యాపారులు విస్మరిస్తూ అక్రమ పద్ధతులు అవలంభిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

సంవత్సరాల తరబడి వ్యాపారాలు...

వ్యాపార సంస్థల నిర్వహణకు ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయని వ్యాపారులు అక్రమంగా సంస్థలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో ఫంక్షన్‌ హాళ్లు, పెట్రోల్‌ బంకులు, బార్లు, కిరాణాషాపులు, మద్యం సిట్టింగ్‌ పాయింట్లలో వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ వాటిలో సింహభాగం సంస్థలకు ట్రేడ్‌ లైసెన్స్‌లు లేవు. లైసెన్స్‌లు ఉన్నవాటికి రెన్యూవల్స్‌ అవుతున్నయో...? లేదో...? కూడా సందేహమే. ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని మున్సిపాలిటీలు ఏనాడూ ఒత్తిడి తెచ్చిన దాఖలాలు కూడా లేవు. ఫలితంగా మునిసిపాలిటీల ఆదాయానికి భారీగా గండి పడుతుండగా, కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ వ్యాపారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలో ఓ వైన్‌ షాప్‌నకు అనుబంధంగా ఉన్న సిట్టింగ్‌ పాయింట్‌కు ట్రేడ్‌ లైసెన్స్‌ లేని కారణంగా మున్సిపల్‌ అధికారులు 10వేల రూపాయలు పెనాల్టీ వేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా ఉన్న సిట్టింగ్‌ పాయింట్లలో ఒక్కదానికి కూడా లైసెన్స్‌లు లేవని సమాచారం. నవంబరులో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి వైన్‌షాపులకు అనుబంధంగా సిట్టింగ్‌ పాయింట్లు కొనసాగుతున్నాయి. అయినా అడిగేవారు లేరు. అలాగే వేల సంఖ్యలో ఉన్న కిరాణా షాపులదీ అదే పరిస్థితి. కొన్ని పెట్రోల్‌ బంకులు, ఫంక్షన్‌ హాళ్లకు కూడా ట్రేడ్‌ లైసెన్సులు లేవని సమాచారం. అసలు లైసెన్స్‌లే లేకుండా సంవత్సరాల తరబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల ధృష్టికి రాకపోవడం గమనార్హం.

ఖజానాకు భారీ గండి....

ట్రేడ్‌ లైసెన్స్‌ పొందాలంటే నిబంధనల మేరకు వ్యాపార సంస్థలు నిర్ణీత రుసుం చెల్లించాలి. రోడ్డును ఆనుకొని ఉన్న వ్యాపార సంస్థల సైజును బట్టి ఫీజు నిర్ణయిస్తారు. సింగిల్‌ వే రోడ్డులో ఉన్న షాప్‌నకు స్క్వేర్‌ ఫీట్‌కు మూడు రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్‌ రోడ్డు అయితే స్క్వేర్‌ ఫీట్‌కు నాలుగు రూపాయలు, జాతీయ రహదారి అయితే స్క్వేర్‌ ఫీట్‌కు ఆరు రూపాయల చొప్పున ఫీజు చెల్లించి లైసెన్స్‌ పొందాలి. ఉదాహరణకు 10 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న గదిలో వ్యాపారం నిర్వహిస్తే సగటున ఫీట్‌కు నాలుగు రూపాయల వంతున మొత్తం 1,300 రూపాయల పైచిలుకు సాలుసరి లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వేల సంఖ్యలో వివిధ రకాల వ్యాపార సంస్థలు ఉండగా ప్రతియేడు లైసెన్స్‌ రూపేణా మున్సిపాలిటీలు లక్షల రూపాయల ఫీజు కోల్పోతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీ మాదిరిగానే ఇతర చోట్లా అధికారులు తనిఖీలు నిర్వహించి, ట్రేడ్‌ లైసెన్స్‌లు లేని వ్యాపార సంస్థలకు జరిమానాలు విధించడం, కొత్త లైసెన్స్‌లు జారీచేయడం ద్వారా ఆయా సంస్థల ఖజానాకు గండిపడకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

Updated Date - Mar 11 , 2026 | 11:47 PM