Share News

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:41 PM

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ఇందారంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి గడ్డం వివేకానంద

-మంత్రి గడ్డం వివేకానంద

చెన్నూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని పాత మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రూ. 2 లక్షల వరకు రుణం గల రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి అధిక మొత్తంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేశామన్నారు. చెన్నూరు పట్టణంలో బస్‌ డిపో ఏర్పాటులో భాగంగా భూవివాదాన్ని త్వరగా పరిష్కరించి డిపో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయధికారులు పంటల మెళకువలు, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీ చైర్మన, వైస్‌ చైర్మన,డైరెక్టర్‌లు, సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం దిశగా కృషి చేయాలన్నారు. అంతకుముందు చెన్నూరు పట్టణంలోని ఓ కన్వెన్షన హాలులో పదో తరగతి విద్యార్థులకు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి షహబుద్దీన, మున్సిపల్‌ చైర్‌పర్సన పెద్దింటి పద్మ, వైస్‌ చైర్మన వినయ్‌, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన మహేష్‌ ప్రసాద్‌ తివారీ, వైస్‌ చైర్మన పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళ సంక్షేమానికి ప్రాధాన్యం

జైపూర్‌: మహిళల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఇందారం గ్రామంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి గ్రామైక్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 30 లక్షల వ్యయంతో మూడు గ్రామ సమైక్య సంఘాల భవన నిర్మాణాలకు భూమి పూజ చేశామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ. 3.50 కోట్లతో 35 భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జైపూర్‌లో చేపట్టిన 1250 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్లాంట్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం మండలంలోని 39 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు రఘునాఽథ్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం సంతోష్‌, సర్పంచు ఫయాజ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:41 PM