Share News

ఈదురు గాలుల భీభత్సం

ABN , Publish Date - May 26 , 2026 | 11:33 PM

మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్‌ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్‌లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.

ఈదురు గాలుల భీభత్సం
మందమర్రిలో విద్యుత్‌ తీగలపై పడిన చెట్లు

- తడిసిన ధాన్యం

- నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్‌ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్‌లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.

దండేపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): జన్నారం మండల కేంద్రంలో సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లపై చెట్లు కూలాయి. ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్‌తో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను అంతరాయం లేకుండా చూశారు. విద్యుత్‌తీగలు తెగిపోవడంంతో విద్యుత్‌కు అంతరాయం నెలకొంది. ఓ ఫంక్షన్‌హాల్‌ రేకులు లేచిపోయి కుప్పకూలింది.

కాసిపేట, మే 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మల్కేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో వర్షం, గాలుల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు. వర్షానికి ధాన్యం కుప్పల్లో నీరుచేరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడ్డారు. గాలివాన ధాటికి టార్పాలిన్‌ కవర్లు లేచిపోవడంతో ధాన్యం కుప్పలపైకి పశువులు చేరి ధాన్యాన్ని తిన్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

మందమర్రిటౌన్‌/రూరల్‌: మందమర్రి మండల వ్యాప్తంగా మంగళవారం భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 3గంటల పాటు వర్షం కురిసింది. ఈదురు గాలులుతో రోడ్డులో ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడింది. మేడారం వద్ద రాష్ర్టీయ రహదారి సింగరేణి డిగ్రీ కళాశాల వద్ద విద్యుత్‌ స్తంభం పడిపోయింది. పలువురి ఇల్లు పై కప్పులు ఎగిరిపోయాయి.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు కక్కాడు. సాయంత్రం ఈదురు గాలులు, పిడుగులు, ఉరుములతో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. కన్నాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో స్థానికులు భయంతో బెంబేలెత్తిపోయారు.

తాండూర్‌: మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో మడె కిష్టయ్యకు చెందిన ఇంటిపై భారీ చెట్టు పడడంతో ఇళ్లు పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో ఇంట్లోని వారు గమనించి బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు ఇంటిపై పడిన చెట్టు కొమ్మలను తొలగించారు. అలాగే గోపాల్‌నగరం మూలుమలుపు వద్ద రహదారిపై చెట్లు విరిగిపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా అధికారులు తొలగించారు. ఘటన స్థలాలకు ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్‌ఐ ప్రసాదరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పద్మజలు, స్థానిక సర్పంచులు చేరుకుని తగిన సహాయక చర్యలు చేపట్టారు.

Updated Date - May 26 , 2026 | 11:33 PM