Share News

ఎండ ప్రచండం...

ABN , Publish Date - May 16 , 2026 | 11:09 PM

భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

ఎండ ప్రచండం...

- జిల్లాలో భానుడి ప్రతాపం

- రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

- జిల్లాలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

ఆసిఫాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి జిల్లా కేంద్రంలోని రోడ్లన్ని మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి.వ్యవసాయ, ఉపాధి హామి కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గత వారం రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్య అవసరమైతేనే బయటకు రావాలని తగిన జాగ్రత్తలు తీసుకొవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నిర్మానుష్యంగా రహదారులు..

ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తారస్థాయికి చేరుకొవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ చురుకుమంటోంది. 11 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంట్లో ఉన్నా తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గలయిన కూలర్లు, ఏసీల ద్వారా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

45.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

జిల్లాలో పగటి ఉష్ణోగ్రత గత వారం రోజులుగా 43 నుంచి 45డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో నిప్పుల కొలిమిగా మారింది. వారం రోజుల నుంచి పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల సెల్సీయస్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదపుతోంది. శనివారం ఆసిఫాబాద్‌ మండలంలో 45.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా కెరమెరిలో 44.8, సిర్పూర్‌-టీలో 44.5, కాగజ్‌నగర్‌, వాంకిడిలలో 43.9, రెబ్బెనలో 43.3, తిర్యాణిలో 43.1, పెంచికల్‌ పేటలో 43.0 డిగ్రీల ఉస్ణోగ్రలలు నమోదయ్యాయి.రోజురోజుకు ఎండ తీవ్రత మరింత పెరుగుతుండడంతో వీధులు, ప్రధాన రహదారిపై జన సంచారం ఉండడం లేదు. దీంతో రహదారలన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

దినసరి కూలీలు, ప్రధానంగా ఉపాధిహామి పనులు చేస్తున్న వారు ఎండ వేడిని తట్టుకోవడం కష్టంగా మారింది. సాయంత్రం అయిదు గంటల తరువాత కూడా వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతలపానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో శీతలపానియా విక్రయాలు ఊపందుకుంటున్నాయి. అలాగే కొబ్బరి బొండాలు విక్రయాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి.

Updated Date - May 16 , 2026 | 11:09 PM