Share News

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

ABN , Publish Date - May 05 , 2026 | 11:26 PM

సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

- బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తయిన నిర్మాణాలు

- నాయకుల జోక్యంతో నిలిచిన పంపిణీ ప్రక్రియ

- సంవత్సరాలుగా వృథాగా రెండంతస్థుల భవనాలు

- కలెక్టర్‌ ప్రకటనతో లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు

మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గూడులేని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరకపోగా, నిరుపేదలకు పంపిణీ చేసేందుకు నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం వృథాగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం తోపాటు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఇళ్ల పంపిణీకి పూనుకోవడంతో లబ్ధిదారుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.

- 1,206 ఇళ్ల నిర్మాణం పూర్తి..

జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,656 డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,206 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 160 ఇళ్లు నిర్మాణ దశలో ఆగిపోయాయి. నిర్మాణం పూర్తయిన వాటిలో కేవలం 330 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మరో 1,176 ఇళ్లు పంపిణీ చేయాల్సి ఉండగా సంవత్సరాలు గడుస్తున్నా వాటికి ముహూర్తం కలిసిరావడం లేదు. వాటి నిర్మాణం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కొక్కదానికి రూ. 5.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించింది. విడతల వారీగా రూ. 86.68 కోట్లు మంజూరుకాగా రూ. 62 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 1,406 ఇళ్లకు మాత్రమే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి నిర్మాణాలు చేపట్టారు.

మంచిర్యాల నియోజకవర్గానికి 650 ఇళ్ల మంజూరు కాగా 360 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో కేవలం 330 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా, మిగతా చోట్లా ఎక్కడ కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవు.

చెన్నూరు నియోజకవర్గంలో 846 ఇళ్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పంపిణీకి నోచుకోలేదు.

బెల్లంపల్లి నియోజకవర్గానికి మంజూరైన 160 ఇళ్లలో నిర్మాణం పూర్తి చేసుకున్నవి కూడా పంపిణీకి నోచుకోవడంలేదు. దీంతో రెండంతస్థులతో చేపట్టిన నిర్మాణాలన్నీ ప్రస్తుతం వృథాగా పడి ఉన్నాయి.

లబ్ధిదారులను ఎంపిక చేసినా...

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. మొదటి విడతలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన 360 గృహాలను అర్హులకు కేటాయించేందుకు అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మీ-సేవ ద్వారా అందిన 2,958 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వార్డుల వారీగా 1,621 మందిని అర్హులుగా గుర్తించి, వారి జాబితాను 2022 ఆగస్టు 29న మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రచురించారు. జాబితాపై ఆక్షేపణలు ఉంటే అది ప్రచురితమైన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక జాబితాపై అందే ఆక్షేపణలను పరిగణలోకి తీసుకొని తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి పండుగకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ మితిమీరిన రాజకీయ జోక్యంతోపూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. కాగా గతనెల 28న కలెక్టర్‌ మంచిర్యాల నగరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. త్వరలో అర్హులకు ఇళ్లు పంపిణీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

‘ఇందిరమ్మ’వర్తించేనా?

జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 2007-08లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు సర్వే నంబర్‌ 345లో నివేశన స్థలాలు పంపిణీ చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతోపాటు 75 గజాల చొప్పున స్థలాలనూ అప్పగించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అప్పటి 32 వార్డుల్లో 22 వార్డులకు చెందిన సుమారు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాటిలో దాదాపు 80 శాతం మంది లబ్ధిదారులు రూ. 50వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేసి బేస్మెంట్లు, పిల్లర్లు నిర్మించుకున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా స్థలాలను ఖాళీగా వదిలివేశారు. స్థోమత ఉన్న వారు ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం కూడా ఉంటున్నారు. ఆ తరువాత ప్రభుత్వం మారి ఇందిరమ్మ పథకం మరుగున పడగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో 2019-20 మధ్యకాలంలో అధికారులు సర్వే నంబర్‌ 345లో వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఆందోళనకు దిగడంతో అధికారులు వారితో సంప్రదింపులు జరిపారు. స్థలాలు కోల్పోయిన వారిని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఉన్న కట్టడాలను తొలగించి అదే ప్రాంతంలో డబుల్‌ ఇల్లు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలోనూ వారికి మొండిచేయి చూపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి పూనుకోవడం, గతంలో ఎమ్మెల్సీ హోదాలో పట్టాలు పంపిణీ చేసిన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో తమకు ఇందిరమ్మ పథకంలో తిరిగి అవకాశం కల్పిస్తారేమోనని బాధితులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 11:26 PM