Share News

పట్టాలు రాక... పంట అమ్ముకోలేక..

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:39 PM

వారంతా దళిత రైతులు.. 50 ఏళ్లుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాతముత్తాల కాలం నుంచి భూములు సాగుచేసుకుంటున్న వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పట్టా పాసుపుస్తకాలు జారీ చేసింది.

పట్టాలు రాక... పంట అమ్ముకోలేక..
రైతులు సాగుచేస్తున్న రొమ్మీపూర్‌లోని భూములు

- పాత పాసుపుస్తకాలున్నా డిజిటల్‌కు నిరాకరణ

- రొమ్మీపూర్‌ రైతుల గోడు పట్టని అధికారులు

- కార్యాలయాల చుట్టూ తిరిగినా కనికరించని వైనం

మంచిర్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వారంతా దళిత రైతులు.. 50 ఏళ్లుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాతముత్తాల కాలం నుంచి భూములు సాగుచేసుకుంటున్న వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పట్టా పాసుపుస్తకాలు జారీ చేసింది. దాంతో ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ధాన్యాన్ని సులభంగా విక్రయించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు ఉన్న పట్టా పాసుపుస్తకాలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా వాటి స్థానంలో డిజిటల్‌ పాసుబుక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే గ్రామంలో కులాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా వారికి డిజిటల్‌ పట్టా పాసుపుస్తకాలు మంజూరు కాకపోవడంతో ధాన్యం అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని జైపూర్‌ మండలం కిష్టాపూర్‌ పంచాయతీ పరిధిలోని రొమ్మీపూర్‌ గ్రామ రైతుల ధీనగాథ ఇది.

పంటను అమ్ముకోవడంలో తప్పని ఇబ్బందులు...

రొమ్మీపూర్‌ గ్రామంలో సర్వే నంబర్‌ 50లో దాదాపు 400 ఎకరాల పైచిలుకు భూములున్నాయి. వాటిపై ఆధారపడి సుమారు 50 మంది రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా భూములు సాగు చేస్తున్నప్పటికీ ధరణి పోర్టల్‌ పుణ్యమా అని పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టా పాసుపుస్తకాలు లేని కారణంగా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డిజిటల్‌ పట్టా పుస్తకం లేకపోవడంతో అధికారికంగా కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్మే వెసులుబాటు లేదు. దళారీలకు విక్రయిస్తే ధర తక్కువ చెల్లించడమే కాకుండా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితులతో రొమ్మీపూర్‌ రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరణిస్థానంలో భూ భారతి పోర్టల్‌ను తెచ్చినప్పటికీ వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని రైతులు మూకుమ్మడిగా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. మోఖాపై ఉండి పంటలు సాగుచేస్తున్నా, రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో భూమి లేనికారణంగా పండించిన పంటను అమ్ముకోవడం సమస్యగా మారింది. అధికారులు స్పందించి డిజిటల్‌ పట్టా పాసుపుస్తకాలు అందజేస్తే తమ సమస్యలు తీరుతాయని రైతులు కోరుతున్నారు.

సెంటర్‌ నిర్వాహకుల మధ్య తగాదాలు

కిష్టాపూర్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు రెండు డీసీఎంఎస్‌ సెంటర్లతో పాటు ఒక డీఆర్‌డీఏ కేంద్రం ఉంది. కొనుగోలు కేంద్రాల మధ్య ఏర్పడ్డ తగాదాల వల్ల రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంతకాలం రైతుల విజ్ఞప్తి మేరకు గ్రామంలోని ఓ సెంటర్‌ నిర్వాహకుడు ధాన్యం కొనుగోలు చేసి తన పేరిట, కుటుంబసభ్యుల పేరిట ప్రభుత్వం నుంచి జమ అయిన నగదును రైతులకు అందజేసేవారు. నిర్వాహకుల మధ్య తగాదాలు ఏర్పడడంతో పట్టా పాసుపుస్తకాలు లేని భూముల్లో పండిన పంట కొనుగోలు చేయడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటూ డీసీఎంఎస్‌ నిర్వాహకుడిపై మరో సెంటర్‌ నిర్వాహకుడు జిల్లా కలెక్టర్‌తో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు చేయడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇంతకాలం ధాన్యం కొనుగోలు చేసిన సెంటర్‌ నిర్వాహకుడు ససేమిరా అనడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయమై రైతులంతా మూకుమ్మడిగా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకునేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ కక్షలతోనే డీసీఎంఎస్‌ సెంటర్‌లో ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇంతకాలం సవ్యంగా సాగిన కొనుగోళ్లలో తగాదాలు రావడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. దాని ఫలితం దళిత రైతులు అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పట్టా పాసుపుస్తకాలు అందజేయాలి

- తలారి మల్లయ్య, రైతు, రొమ్మీపూర్‌

వ్యవసాయంపై ఆధారపడ్డ మాకు అధికారులు డిజిటల్‌ పట్టా పాసుపుస్తకాలు అందజేయాలి. ఐదుగురం అన్నదమ్ములం. మా అందరికి కలిపి 15 ఎకరాల భూమి ఉంది. మా కుటుంబాలు ఆ భూములపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య ఏర్పడ్డ తగాదాలతో మేము సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

అధికారులు కనికరించాలి

- పాగిడి రాజమల్లు, రైతు, రొమ్మీపూర్‌

ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్నాం. పట్టా పాసుపుస్తకాలు లేవనే నెపంతో కొనుగోలుకు ముందుకు రావడం లేదు. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. నాకున్న నాలుగెకరాల్లో వరి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాం. కనీసం యూరియా కూడా ఇవ్వడంలేదు. ఇప్పటికైనా అధికారులు కనికరించి పట్టా పాసుపుస్తకాలు అందజేయాలి.

Updated Date - Jan 07 , 2026 | 11:39 PM