గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:24 PM
గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
కోటపల్లి, జూన 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మండలంలోని లింగన్నపేట, ఏదులబంధం, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ గ్రామాల్లో రూ. 60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తాగునీటి సమస్యలేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరంతరంగా రేషన కార్డులు అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి సత్వరం పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. మిషన భగీరఽథ అట్టర్ ప్లాప్ ప్రాజెక్టు అని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఇంటికి చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. దీంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఏదులబంధంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మంత్రి పాఠశాల ప్రహారీతో పాటు అదనపు తరగతి గదులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన మహేష్ ప్రసాద్ తివారీ, పార్టీ మండల అధ్యక్షుడు కాట్రాల మల్లయ్య, తహసీల్దార్ రాఘవేందర్‌రావు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
- బాధిత కుటుంబానికి పరామర్శ
వెంచపల్లి గ్రామంలో ఇటీవల ప్రాణహిత నదిలో పడి మృతిచెందిన పబ్బ అజయ్‌గౌడ్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మృతుని తండ్రి తిరుపతిగౌడ్, తల్లి భాగ్యలను పరామర్శించిన మంత్రి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.