పోస్టింగుల్లో పైరవీలకే పెద్దపీట
ABN , Publish Date - May 26 , 2026 | 11:39 PM
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.
-పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఇష్టారాజ్యం
-రాజకీయ అండ ఉన్నోళ్లకే అధికారుల వత్తాసు?
-ప్రాధాన్యం గల ఖాళీల్లో వారికే అందలం
-ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా ఈనెల 25న బదిలీల ప్రక్రియ చేపట్టగా నిబంధనలను గాలికి వదిలివేసినట్లు సమాచారం. ఈ విషయమై ఈ నెల 25వ తేదీన ’ఆంధ్రజ్యోతి’లో ’లెటర్ పట్టు...పోస్టింగ్ కొట్టు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనంలో పేర్కొన్నట్లుగానే పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేశారు. అధికారుల నిర్వాకం కారణంగా నిబంధనల మేరకు అన్ని అర్హతలు ఉండి, కౌన్సెలింగ్‌లో అనుకూలమైన చోటు దక్కని వారు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇంతకాలం సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహించిన తమకు బదిలీల్లో కుటుంబానికి చేరువలో ఉండే విధంగా పోస్టింగ్ వస్తుందని అనేక మంది కలలు కన్నారు. తీరా పైరవీ మంత్రం పనిచేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇష్టారాజ్యంగా పోస్టింగులు...
జిల్లాలో మొత్తం 308 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 40 శాతం మేర పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపట్టవలసి ఉంది. ఆ మేరకు 97 పోస్టులకు సంబంధించి బదిలీ ప్రక్రియ జరగాల్సి ఉండగా, ఆ సంఖ్యకు సరిపడా ఖాళీల జాబితా సైతం ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం బదిలీలు జరగాల్సి ఉండగా, దానికి భిన్నంగా కొన్ని చోట్లా పోస్టులను ఖాళీగా వదిలి వేసినట్లు తెలుస్తోంది. ఆయా పోస్టులకు కౌన్సెలింగ్‌లో ఐదారుగురు పోటీ పడినప్పటికీ ఎవరికీ కేటాయించకుండా వదిలి వేసినట్లు సమాచారం. మిగతా వాటిలో దాదాపు 70 శాతం మేర పైరవీ మేరకే పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది. ఈ తతంగం వెనుక పంచాయతీ శాఖకు చెందిన కొందరు అధికారులు చక్రం తిప్పినట్లు సమాచారం. వారి అండదండలతో పెద్దమొత్తంలో ముడుపులు కూడా ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేడ్-3 కార్యదర్శులు పలువురికి అనుకున్న చోట కాకుండా ఇతర పంచాయతీలు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ అంతా పైరవీలు, ముడుపుల ఆధారంగా ఇష్టారాజ్యంగా సాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ ఖాళీలు ఎందుకు వదిలిపెట్టినట్లు...?
జిల్లాలో పేర్కొన్న విధంగా 97 మంది పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రేడ్ -4 విభాగం కింద పనిచేస్తున్న వారు 88 మందికి బదిలీ చేపట్టవలసి ఉండగా, గ్రేడ్-3 కింద ఏడుగురు, గ్రేడ్-2 విభాగంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం కలగాలి. అయితే వాటిలో గ్రేడ్-3 పంచాయతీలు కొన్నింటిని ఖాళీగా వదిలిపెట్టడం ఆనుమానాలకు దారితీస్తోంది. ప్రధానంగా మేజర్ పంచాయతీలైన జైపూర్ మండలంలోని గ్రామపంచాయతీ, కాసిపేట మండలం దేవాపూర్, జన్నారం మండలం పొన్కల్ స్థానాలను ఖాళీగా వదిలి వేశారు. ఇందులో ఇందారం పంచాయతీకి ఐదారుగురు పోటీ పడ్డప్పటికీ దాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆలస్యంగా కేటాయించారు. అలాగే దేవాపూర్, పొన్కకల్ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయకపోవడం వెనుక అంతరార్థమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల మేజర్ పంచాయతీలను గ్రేడ్-3 కార్యదర్శులకు కాకుండా, గ్రేడ్-4 వారికి కేటాయించినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు మంగళం....
గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీలకు సంబంధించి జీవో 38 ప్రకారం కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్‌లో ఒకే చోటును ఒకరి కంటే ఎక్కువ మంది కోరుకున్న పక్షంలో స్పౌజ్ (భార్యాభర్తలు) విభాగానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. భర్త ఎక్కడ పని చేస్తే అదే ప్రాంతంలో భార్యకు పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన మేరకు స్పౌజ్ కోటాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆ తరువాత 31-05-2027 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు, 70 శాతం మేర వికలాంగు లకు, ఉద్యోగి పిల్లలు మానిసిక వికలాంగులై ఉన్న వారికి, భర్త మరణించిన ఉద్యోగినిలకు, క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి, పూర్తిగా మారుమూల పంచాయతీల్లో పనిచేసిన (హార్డ్ చిప్ ఏరియాలు) వారితోపాటు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. బదిలీల సందర్భంగా పై నిబంధనలకు మంగళం పాడారన్న అపవాదులు ఉన్నాయి.