నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:32 PM
: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షను జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.
- అదనపు కలెక్టర్ డేవిడ్
ఆసిఫాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షను జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి వేణు, డీఎస్పీ అశోక్‌లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, 353 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుందని అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని, 1.30 గంటల తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, అడ్మిట్ కార్డు, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు సరిపడ కుర్చీలు, టేబుళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అవసరమైన మందులతో శిబిరం ఏర్పాటు చేయాల ని, ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడిపించాలని ఆదేశించారు. సమావేశంలో నీట్ పరీక్షల సిట్ సమన్వయకర్త నరసింహాస్వామి, తహసీల్దార్ రియాజ్, ముఖ్యపర్యవేక్షకులు, విద్య, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖల అధికారులు, పాల్గొన్నారు.