బహుమతుల ఎర
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:21 PM
డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహుమతుల ఎర చూపి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు.
- అమ్మకానికి నాన్ లే అవుట్ ప్లాట్లు
- కస్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్టర్ల బంపర్ ఆఫర్లు
- వెలుస్తున్న అక్రమ వెంచర్లు
- పట్టని అధికారులు
మంచిర్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహుమతుల ఎర చూపి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు. అది కూడా నాన్ లే అవుట్ వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లు కావడం కొసమెరుపు. జైపూర్ మండలంలోని నర్వా రోడ్డులో గల ఓ వెంచర్ నిర్వాహకుల నిర్వాకమిది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాట్లను అమాయకులైన ప్రజలకు అంటగట్టేందుకు బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నా... రెవెన్యూ అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం.
అక్రమార్జనే ధ్యేయం...
అక్రమార్జనే ధ్యేయంగా చలామణి అవుతున్న కొందరు వ్యాపారుల చర్యలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. తెలిసి తప్పిదాల్లో అడుగులు వేస్తున్న వారు కొందరైతే....తెలియక వ్యాపారుల వలలో చిక్కుకుని నిలువునా మోసపోతున్నవారు మరికొందరు ఉన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా తమ అక్రమ సామ్రాజ్యాలను విస్తరిస్తున్న వ్యాపారులు అదును చూసి ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ తతంగం మంచిర్యాల జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. జిల్లాలోని మారుమూల మండలాల ప్రజలేగాక, ఇక్కడ వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్తులు సొంతంగా ఇల్లు నిర్మించుకుని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం అనువైన స్థలాలను కొనుగోలు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపుతున్నారు.
విచ్చల విడిగా నాన్ లే అవుట్ వెంచర్లు....
జిల్లా కేంద్రంతోపాటు జైపూర్, చెన్నూరు, హాజీపూర్, లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు ఏరియాల పరిధిలో వందల సంఖ్యలో నాన్ లే అవుట్ ప్లాట్ల వెంచర్లు పుట్టుకు వచ్చాయి. వాటిని వ్యాపారులు సామాన్య ప్రజలకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహిరంగంగా నాన్ లే అవుట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. నాన్ లే అవుట్ వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ డివిజన్‌గా మార్చవద్దని నిబంధనలు చెబుతున్నా వాటిని ఖాతరు చేయని అధికారులు.. వ్యాపారులు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి గజాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారుల నిర్వాకం కారణంగా సామాన్య ప్రజలకు ఇళ్ల నిర్మాణ సమయంలో అనుమతులు రాక ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. నాన్ లే అవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక్కోదానికి రూ. 30వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ....
జైపూర్ మండలంలోని నర్వా రోడ్డులో వెలిసిన ఓ వెంచర్ నిర్వాహకులు రకరకాల బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి లే అవుట్ అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడమేగాక, అందులోని ప్లాట్లను విక్రయించేందుకు ఇటీవల ‘బంగారు నాణెం’ ఆఫర్ ప్రకటించారు. వెంచర్ ప్రారంభం రోజున ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి బంగారు నాణెం అందజేస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో కూడా నిర్వాహకులు స్కూటీ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా పెద్దపెద్ద కటౌట్లు పెట్టి, బహిరంగ విక్రయానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆఫర్ల కింద ఇవ్వజూపే వస్తువుల ధరలను కూడా ప్లాట్ల రేట్‌లోనే జమచేసి, విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంచర్ ఉన్న చోట చదరపు గజం ధర 5,699 రూపాయలు ప్రకటించగా, వాస్తవానికి అక్కడ 3,500 రూపాయల రేటు పలుకుతున్నట్లు సమాచారం. ఇలా కస్టమర్ల నుంచి అడ్డగోలు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్‌లోని ప్లాట్లకు కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.